
ఫిబ్రవరి 4న రథసప్తమికి తిరుమలలో శ్రీవారి దర్శనానికి విస్తృత ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. అన్నమయ్య భవనంలో ధర్మకర్తల మండలి సమావేశం ముగిసిన అనంతరం బీఆర్ నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. రథసప్తమి రోజు పలు ఆర్జిత సేవలను ఏకాంతంగా నిర్వహించేందుకు నిర్ణయించినట్లు వివరించారు.
సిఫార్సు లేఖల దర్శనాలు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. తిరుపతిలో జారీ చేసే సర్వదర్శనం టోకెన్లనూ రద్దు చేస్తున్నామని తెలిపారు. నేరుగా వచ్చే భక్తులను వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ల ద్వారా దర్శనానికి అనుమతిస్తామని బీఆర్ నాయుడు వివరించారు. మాఢ వీధుల్లో వాహన సేవల దర్శనాలకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామని చెప్పారు.
మాఢ వీధుల్లో భక్తులకు ఎండ, చలి నుంచి రక్షణ కోసం ప్రత్యేక షెడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 8 లక్షల లడ్డూ ప్రసాదాలను అందుబాటులో ఉంచాలని నిర్ణయించినట్లు వివరించారు. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ సమయంలో చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో రథసప్తమి ఏర్పాట్లపై సమావేశంలో చర్చించామని పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూస్తామని బీఆర్ నాయుడు తెలిపారు.
ఫిబ్రవరి 4 తేదీన ఉదయం 5:30 గంటలకు సూర్యప్రభ వాహన సేవతో మొదలయ్యి, రాత్రి 9 గంటలకు చంద్రప్రభ వాహన సేవతో వాహన సేవలు ముగియనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. రథసప్తమి వేడుకలకు దాదాపు రెండు లక్షల మంది వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. మాడవీధుల్లో వాహన సేవలు తిలకించేందుకు వేచి ఉండే భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, నీరు, మజ్జిగ వంటివి పంపిణీ చేస్తామన్నారు. గ్యాలరీల్లోని ఎంట్రీ, ఎగ్జిట్ ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని, భద్రత, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
More Stories
ఏపీలో ఆలయాలకు స్వతంత్ర ప్రతిపత్తి
వైజాగ్ విజ్ఞాన్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం
మూడురోజుల పాటు తిరుపతిలో టెంపుల్ ఎక్స్పో