భీమా లేకపోతే నో పెట్రోల్‌, డీజిల్‌, ఫాస్టాగ్‌!

భీమా లేకపోతే నో పెట్రోల్‌, డీజిల్‌, ఫాస్టాగ్‌!
వాహనాలపై కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. అన్ని వాహనాలకు థర్డ్‌ పార్టీ బీమా తప్పనిసరి చేసింది. బీమా లేకపోతే పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోలు చేయలేరు. ఫాస్టాగ్‌ కోసం కూడా ఇన్సూరెన్స్‌ డాక్యుమెంట్లు చూపించాల్సి ఉంటుంది. లైసెన్స్‌ సర్టిఫికెట్‌లు పొందాలంటే కూడా బీమా తప్పనిసరి. 
 
ఇన్సూరెన్స్‌ లేకుండా డ్రైవింగ్‌ చేస్తూ పట్టుబడితే భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు బీమా ఉంటే జరిగిన నష్టానికి పరిహారం పొందే వీలు కలుగుతుంది. ఇన్సూరెన్స్‌తో ఇతర ప్రయోజనాలు కూడా పొందవచ్చని అధికారులు చెప్తున్నారు. లేకపోతే చాలా నష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

మోటారు వాహనాల చట్టం-1988 ప్రకారం అన్ని మోటారు వాహనాలకు తప్పనిసరిగా థర్డ్‌పార్టీ బీమా పాలసీ ఉండాలి. కానీ ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఐఆర్‌డీఏ) 2024లో దేశంలో 40 కోట్ల వాహనాలు ఉన్నాయని అంచనా వేస్తే అందులో దాదాపు 50 శాతం వాహనాలకు మాత్రమే బీమా ఉందని తెలుస్తోంది. 

కొత్త నిబంధనల ప్రకారం బీమా లేకుండా వాహనం నడుపుతూ మొదటిసారి పట్టుబడితే రూ.2,000 జరిమానా లేదా మూడు నెలల జైలు శిక్ష లేదా రెండూ విధించవచ్చు. రెండోసారి పట్టుబడితే రూ.4,000 వరకు జరిమానా ఉంటుంది.

వాహన సర్వీస్‌ రూల్స్‌లో మార్పులు చేసే ప్రతిపాదనలను కూడా కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ పరిశీలిస్తున్నట్టు తెలుస్తున్నది. వాహన సేవలను బీమా కవరేజీతో లింక్‌ చేసే అవకాశాలున్నాయి. ఈ కొత్త నిబంధనలను కచ్చితంగా పాటించేలా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు ఇవ్వనున్నట్టు రవాణా శాఖ వర్గాలు చెప్తున్నాయి.