
ఢిల్లీ మాదిరిగా కేరళలోనూ లిక్కర్ స్కామ్ జరిగిందని, దీని వెనక తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక పాత్ర పోషించారని అసెంబ్లీలో విపక్ష కాంగ్రెస్ నేత వీడీ సతీశన్ ఆరోపించారు. గురువారం ఆయన మలప్పురంలోని ఎడవన్నలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలు వివరాలను వెల్లడించారు. 2023లో ఈ కుంభకోణం జరిగిందని పేర్కొన్నారు.
‘‘అప్పట్లో పాలక్కడ్‌లోని ఎలపల్లి పంచాయతీలో ఒయాసిస్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరిట భూములను కొనుగోలు చేశారు. అనూహ్యంగా ఆ తర్వాత మద్యం విధానంలో సవరణలు చేసి, ఆ కంపెనీకి మద్యం తయారీ లైసెన్స్ ఇచ్చారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఎక్సైజ్ మంత్రి ఎంబీ రాజేశ్ ఏ శాఖను సంప్రదించకుండా ఏకపక్షంగా అనుమతులిచ్చారు. ఈ వ్యవహారాన్ని నడిపించింది కల్వకుంట్ల కవిత. ఆమె కేరళకు వచ్చి, ప్రభుత్వ పెద్దలతో మంతనాలు జరిపారు’’ అని ఆయన వివరించారు.
తమ ఆరోపణలకు క్యాబినెట్ నోటే ఆధారమని చెప్పారు. తాము మీడియాకు విడుదల చేసిన కేబినెట్ నోట్ నకిలీది అని మంత్రి ఖండించలేదని గుర్తు చేశారు. ఒయాసిస్ కోసం మద్యం పాలసీని సవరించారని, ఆ తర్వాత దుకాణాల కేటాయింపు విషయాలు కూడా ఎవరికీ తెలియదని ప్రతిపక్షాలు మండిపడుతున్న విషయాన్ని ప్రస్తావించారు.
కాగా, ఒయాసిస్ కంపెనీకి లైసెన్స్ వచ్చిన విషయం పాలక్కడ్‌లోని డిస్టిలరీలకు కూడా తెలియదని ఆయన పేర్కొన్నారు. 2023 పాలసీని ఆమోదించిన వెంటనే ఒయాసిస్ కంపెనీకి మద్యం తయారీ యూనిట్ నిర్వహణకు అనుమతులు లభించాయని తెలిపారు. ఈ వ్యవహారంలో కవిత పాత్ర, ఆమె కేరళలో ఎక్కడ బస చేశారు? అనే వివరాలను పరిశోధించాల్సి ఉందని ఆయన డిమాండ్ చేశారు.మధ్యప్రదేశ్, పంజాబ్ కేంద్రాలుగా ఒయాసిస్ కంపెనీ కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు సతీశన్ తెలిపారు. పంజాబ్‌లో భూగర్భ జలాలను కలుషితం చేస్తోందంటూ ఆ కంపెనీపై కేసులున్నట్లు చెప్పారు. తాను చేస్తున్న ఆరోపణలపై కంపెనీ నుంచి ప్రతిస్పందన లేదని, మంత్రి రాజేశ్ కంపెనీ ప్రతినిధి మాదిరిగా ప్రకటనలు చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు.
‘‘నేను ఎంపీగా ఉన్నప్పుడు పాలక్కడ్‌లో నీటి కొరత కారణంగా ఎన్నో ప్రాజెక్టులను వదులుకోవాల్సి వచ్చింది. అలాంటిది 8 కోట్ల లీటర్ల నీటిని వినియోగించే ఒయాసి్‌సకు ఎలా అనుమతినిచ్చారు?’’ అని ప్రభుత్వాన్ని నిలదీశారు. కాగా సతీశన్ చేసిన ఆరోపణలను ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ నీచ రాజకీయాలకు ఈ ఆరోపణలు నిదర్శనమని మండిపడ్డారు. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె తేల్చిచెప్పారు.
మరోవంక, కేరళలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రమేష్ చెన్నితల కూడా రాష్ట్ర ప్రభుత్వం బ్రూవరీ ప్రాజెక్టుకు అనుమతిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఒక ప్రైవేట్ కంపెనీకి అనుమతి ఇవ్వడంలో భారీ అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు.
“ప్రభుత్వం ఏ శాఖలకు సమాచారం ఇవ్వకుండా లేదా దాని భాగస్వామ్య పార్టీలతో సంప్రదించకుండా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లింది. ఎవరినీ విశ్వాసంలోకి తీసుకోకుండానే ఏకపక్షంగా ప్రాజెక్టును ఆమోదించింది. అంతేకాకుండా, ఢిల్లీ మద్యం పాలసీ అవినీతి కేసుతో సంబంధం ఉన్న కంపెనీకి అనుమతి మంజూరు చేయబడింది” అని చెన్నితల ఆరోపించారు.
ఈ నిర్ణయంలో అవినీతి ఉందని ఆయన తన వైఖరిని పునరుద్ఘాటించారు. ఈ చర్యను సిపిఐ తీవ్రంగా వ్యతిరేకించిందని, జెడి(ఎస్) కూడా తన భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేసిందని చెబుతూ “ప్రభుత్వం తన సొంత మిత్రదేశాల మద్దతు లేకుండా ముందుకు సాగుతోంది” అని ఆయన ధ్వజమెత్తారు. అసెంబ్లీలో ఈ విషయంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రతిస్పందనను కూడా ఆయన విమర్శించారు. “నా ప్రశ్నను పరిష్కరించడానికి బదులుగా, ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఆరోపణలతో మాత్రమే ప్రతిస్పందించారు” అని చెన్నితల పేర్కొన్నారు.
More Stories
హెచ్‌సీఏ వ్యవహారంపై ఈడీ దృష్టి
భారత్‌కు నష్టం కలిగించారనే ఒక్క ఫొటో చూపించగలరా?
రాజాసింగ్ రాజీనామా ఆమోదించిన జేపీ నడ్డా