గృహహింసపై సమాజమే మారాలి.. ఏం చేయలేం

గృహహింసపై సమాజమే మారాలి.. ఏం చేయలేం
ప్రస్తుతం ఉన్న వరకట్న, గృహ హింస చట్టాల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు ఆయా చట్టాలను సమీక్షించి, సంస్కరించేందుకు ఒక నిపుణుల కమిటీని నియమించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని అనుమతించేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.
 
సమాజమే మారాలని, అందులో ఏమీ చేయలేమని చెప్పింది. ‘సమాజంలో మార్పు రావాల్సిందే ఈ విషయంలో మేము ఏమీ చేయలేము. ఇందుకు తగ్గ పార్లమెంటరీ చట్టాలు ఉన్నాయి’ అని జస్టిస్‌ నాగరత్న వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఉన్న వరకట్న, గృహహింస చట్టాలు దుర్వినియోగమవుతున్నాయని, వాటిని సంస్కరించాలని పిటిషన్‌లో కోరారు.  చట్టాలను సమీక్షించేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. 
 
ఇటీవల బెంగళూరులో ఓ టెకీ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. చట్టబద్ధంగానే తన భార్య వేధింపులకు గురి చేస్తుందంటూ చట్టంలోని లొసుగులను బయటపెట్టాడు. టెకీ ఆత్మహత్య తర్వాత వరకట్నం, గృహహింస చట్టాల దుర్వినియోగంపై పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది. ఈ క్రమంలోనే చట్టంలో సంస్కరణ తీసుకురావాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

న్యాయవాది విశాల్‌ తివారీ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రస్తుతం ఉన్న చట్టాలను సమీక్షించేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయ నిపుణులతో కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ సతీశ్‌ చంద్రలతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది.  సమాజమే మారాలని, ఇందులో కోర్టులు ఏం చేయలేమని బెంచ్‌ స్పష్టం చేసింది. 

పెండ్లి సమయంలో ఇచ్చే బహుమతులు, వస్తువులు, నగదుకు సంబంధించిన జాబితాను తయారుచేసి వాటిని అఫిడవిట్‌ రూపంలో రికార్డు చేసి వివాహ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌తో జత చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కూడా పిటిషనర్‌ కోరారు. వరకట్న నిషేధ చట్టం, ఐపీసీలోని 498ఎ సెక్షన్‌ వరకట్న కోరికలు, వేధింపుల నుంచి వివాహిత మహిళకు రక్షణ కల్పిస్తాయి. 

అయితే ఈ చట్టాలు భార్యభర్తల మధ్య వేరే విషయంలో మనస్పర్థలు తలెత్తినపుడు భర్త కుటుంబంపై కక్షసాధించేందుకు ఈ చట్టాలను ఆయుధంగా మలచుకుంటున్నారని పిటిషనర్‌ పేర్కొన్నారు. ఈ చట్టాల కింద పళ్లైన మగవారిపై కొన్నిసార్లు తప్పుడు కేసులు నమోదవుతున్నాయని తెలిపారు.  వరకట్నం కేసుల్లో చాలా మంది పురుషులపై తప్పుడు అభియోగాలు నమోదవుతున్నాయని, ఇవి విషాదాంత పరిస్థితులకు దారి తీస్తున్నాయని పిటిషనర్‌ తెలిపారు. ఇది మన న్యాయ, క్రిమినల్‌ దర్యాప్తు విధానంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని ఆయన తెలిపారు. 

వరకట్నం, గృహ హింస చట్టాల దుర్వినియోగం కారణంగా ఆ చట్టాలను రూపొందించడం వెనుక గల గొప్ప ఉద్దేశాలు ఓడిపోతున్నాయని పిటిషనర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.  చట్టాల్లో సంస్కరణలు తీసుకురావడం ద్వారా అమాయక వ్యక్తుల ప్రాణాలను కాపాడవచ్చని.. చట్టం ఉద్దేశం సైతం నెరవేరుతుందని పిటిషనర్‌ పేర్కొన్నారు.