99.1 కోట్లకు చేరిన భారత ఓటర్ల సంఖ్య

99.1 కోట్లకు చేరిన భారత ఓటర్ల సంఖ్య

భారత్​లో ఓటర్ల సంఖ్య 100 కోట్లకు చేరువైంది. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ఓటర్ల సంఖ్యను ఎన్నికల సంఘం బుధవారం వెల్లడించింది. దేశంలో మొత్తం 99.1 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు ఈసీ ఈ ప్రకటనలో పేర్కొంది. 2024 లోక్​సభ ఎన్నికల సమయంతో పోలిస్తే, 2 కోట్లకు పైగా కొత్త ఓటర్లు తమ పేరు నమోదు చేసుకున్నారని తెలిపింది.

గతేడాది పార్లమెంట్ ఎన్నికలప్పుడు 96.88 కోట్ల మంది ఓటర్లుండగా, ఈసీ తాజా లెక్కల ప్రకారం నేడు ఈ సంఖ్య 99.1 కోట్లకు చేరింది. ఇందులో 18-29 సంవత్సరాల వయసున్న యువతీయువకులు 21.7 కోట్ల మంది ఉన్నారు. అతి త్వరలోనే భారత్​తో ఓటర్ల సంఖ్య 1 బిలియన్ (100 కోట్లు)కు చేరుతుందని చీఫ్​ ఎలక్షన్ కమిషనర్​ రాజీవ్ కుమార్​ పేర్కొన్నారు.

‘మన ఓటర్ల సంఖ్య 99 కోట్లు దాటుతోంది. అతి త్వరలోనే 100 కోట్ల మార్క్ కూడా అందుకుంటాం. ఇది ప్రజాస్వామ్యంలో ఓ రికార్డ్​ కానుంది. ఉత్తర్​ప్రదేశ్, రాజస్థాన్, బిహార్, పంజాబ్ రాష్ట్రాలు ఓటర్ల జాబితా సవరించాల్సి ఉంది. ఆ నివేదిక వచ్చిన తరువాత మన ఓటర్ల సంఖ్య తొలిసారి ఈజీగా 99 కోట్లు దాటేస్తుంది. అందులో మహిళా ఓటర్లు 48 కోట్లు ఉండవచ్చు’ అని రాజీవ్ కుమార్ తెలిపారు.

స్త్రీ, పురుష నిష్పత్తి 2024లో 948 ఉండేది. ప్రస్తుతం ఇది 954కు పెరిగింది. ఈ నిష్పత్తి 2019లో 928 కాగా, 2024నాటికి 948కి పెరిగింది. లోక్‌సభ ఎన్నికల సమయానికి 48,044 మంది థర్డ్‌ జెండర్‌ వ్యక్తులు ఓటర్లుగా నమోదయ్యారు. మొత్తం ఓటర్లలో 47.15 కోట్ల మంది మహిళలు, 49.72 కోట్ల మంది పురుషులు ఉండేవారు.

కాగా, జనవరి 25వ తేదీని జాతీయ ఓటరు దినోత్సవంగా పరిగణిస్తారు. 1950 జనవరి 25న ఎన్నికల సంఘం వ్యవస్థాపన జరిగిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ ఓటరు దినోత్సవం జరుపుకుంటున్నాం.