
కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) కింద ఇచ్చే కనీస పింఛన్‌ను రూ.10,000కు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన ఆమోదానికి సిద్ధంగా ఉందని, బహుశా ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ 2025లో దీనిని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ‘అటల్ పెన్షన్ యోజన కింద ఇచ్చే కనీస పింఛన్‌ను రెట్టింపు చేసే ప్రతిపాదన దాదాపు ఆమోదానికి సిద్ధంగా ఉంది.
దీనిని 2025 బడ్జెట్లో ప్రకటించే అవకాశం ఉంది. దీని ద్వారా చందాదారులకు కాస్త ఆర్థిక స్థిరత్వం, భద్రత ఏర్పడతుంది’ అని ఓ ప్రభుత్వాధికారి చెప్పినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2015 మే 9న అటల్ పెన్షన్ యోజన పథకాన్ని ప్రారంభించారు. పేదలు, అసంఘటిత రంగంలోని కార్మికులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రతను కల్పించడమే లక్ష్యంగా ఈ సామాజిక భద్రతా పథకాన్ని తీసుకొచ్చారు.
మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయీ పేరు మీద ఈ పథకాన్ని తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈ స్కీమ్‌లో చేరిన చందాదారులకు గరిష్ఠంగా ూ.5000 పింఛన్ అందిస్తున్నారు. దీనినే ఇప్పుడు రెట్టింపు చేయాలని కేంద్రం సంకల్పించినట్లు తెలుస్తోంది. 2024 అక్టోబర్ నాటికి 7 కోట్ల మందికి పైగా ఈ అటల్ పెన్షన్ యోజన పథకంలో చేరారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 56 లక్షలకు పైగా కొత్త చందాదారులు నమోదు చేసుకున్నారు.
18-40 వయసున్న వారందరూ ఈ స్కీమ్‌లో చేరడానికి అర్హులు. 60 ఏళ్లు దాటిన తర్వాత నెలకు రూ.1000 నుంచి రూ.5000 వరకు పింఛను పొందొచ్చు. ఇందుకోసం నెలవారీగా కొంత మొత్తం జమ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ చందాదారుడు మరణిస్తే అంతే మొత్తాన్ని జీవిత భాగస్వామికి చెల్లిస్తారు. ఆ వ్యక్తి కూడా మరణిస్తే, పెన్షన్ కోసం సమకూరిన మొత్తాన్ని నామినీకి చెల్లిస్తారు. ఈ పథకంలో చేరిన వారికి పన్ను మినహాయింపులు కూడా లభిస్తాయి. ప్రభుత్వ, ప్రైవేటు, గ్రామీణ బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా (ఆన్‌లైన్/ఆఫ్‌లైన్) ఈ పథకంలో చేరవచ్చు.
More Stories
భారత్ లో ప్రవేశంకు సిద్దమవుతున్న టెస్లా
జాతీయ పార్టీల ఆదాయాలలో 74 శాతం బీజేపీకే
న్యూ ఇండియా బ్యాంకులో రూ. 122 కోట్ల కుంభకోణం