
ప్రయాగ్రాజ్ డీఎం వీంద్రకుమార్ చెప్పిన వివరాల ప్రకారం, ‘సెక్టార్ 19లో గీతా ప్రెస్ టెంట్‌లోని ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు మంటలు చెలరేగాయి. సమీపంలోని 18 టెంట్లకు మంటలు వ్యాపించాయి. పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పివేశారు. ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. పరిస్థితి అదుపులో ఉంది.
“మహా కుంభమేళాలోని సెక్టార్ 19లో మూడు సిలిండర్లు పేలి శిబిరాల్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు” అని అఖారా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ భాస్కర్ మిశ్రా తెలిపారు. “చాలా విచారకరం! మహా కుంభ్ వద్ద జరిగిన అగ్నిప్రమాదం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. తక్షణ సహాయక చర్యలు అందిస్తున్నారు. అందరి భద్రత కోసం మేం గంగమ్మను ప్రార్థిస్తున్నాం” అని కుంభమేళా నిర్వాహకులు పోస్ట్ చేశారు.
ఈ ఘటనపై ఉత్తర్ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆరా తీశారు. అగ్నిప్రమాదంపై విచారణకు ఆదేశించారు. అయితే ఈ ఘటనలో మూడు సిలిండర్లు పేలినట్లు తెలిసిందని యూపీ మినిస్టర్ ఎకే శర్మ తెలిపారు. ప్రమాదం జరిగినా 20 నిమిషాల్లోనే మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు దాదాపు 100 మంది చుట్టుపక్కలే ఉన్నారని, వారికి ఎలాంటి నష్టం జరగలేదని తెలిపారు.
ఇదిలా ఉండగా యూపీ ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఆదివారం ఉదయం 8 గంటల వరకు 17 లక్షల మందికిపైగా భక్తులు మహాకుంభ మేళాకు హాజరయ్యారు. ఏడో రోజు ఆదివారం సాయంత్రం వరకు 54 లక్షల మందికిపైగా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేసినట్లు యూపీ ప్రభుత్వం పేర్కొంది. జనవరి 18 నాటికి మహా కుంభమేళా సందర్భంగా సంగం త్రివేణిలో 7.7 కోట్ల మందికిపైగా యాత్రికులు స్నానాలు చేసినట్లు పేర్కొంది.
ఆదివారం తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కమ్మేసినా.. భక్తులు భారీగా తరలివచ్చి స్నానాలు ఆచరించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులను లెక్క చేయకుండా తరలివస్తున్నారు. మహా కుంభమేళా జనవరి 13న ప్రారంభం కాగా.. ఫిబ్రవరి 26 వరకు కొనసాగనున్నది.
More Stories
ఖతార్ అధినేతకు స్వయంగా ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి మోదీ స్వాగతం!
ఏపీలో ఆలయాలకు స్వతంత్ర ప్రతిపత్తి
కొత్త సీఈసీగా జ్ఞానేశ్‌కుమార్