రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా శనివారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన నివాసంలో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తదితరులతో కలిసి అమిత్‌షా విందు ఆరగించారు. ఈ సందర్భంగా
అనూహ్యంగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్‌ల గురించి అమిత్‌షా ఆరా తీసినట్లు తెలిసింది.
జగన్‌కు ఎన్ని ప్యాలెస్‌లు ఉన్నాయని అమిత్‌షా అడగ్గా బెంగళూరులో ఆరు ఎకరాల్లో ఒక పెద్ద ప్యాలెస్ ఉన్నట్లుందని సీఎం చంద్రబాబు చెప్పారు. “ఆరు కాదు….. మొత్తం 32 ఎకరాలు.అందులో పెద్ద ప్యాలెస్ కట్టుకొన్నారు. హైదరాబాద్‌లో కూడా ఆయన భవనంలో వంద గదులు ఉన్నాయి’’ అని మంత్రి లోకేశ్ వివరించారు. ముప్ఫై రెండు ఎకరాలా అని అమిత్ షా ఆశ్చయపోయారు.
‘ఇవి చాలవని విశాఖపట్నంలో రూ.500 కోట్ల ప్రభుత్వ ధనం ఖర్చు పెట్టి తాను ఉండటం కోసం భారీ భవనాలు నిర్మించారు. నిబంధనలకు విరుద్ధంగా కట్టారని హరిత ట్రైబ్యునల్ ఆ నిర్మాణాలపై రూ. రెండు వందల కోట్లు జరిమానా విధించింది’’ అని చంద్రబాబు చెప్పారు. ఆ డబ్బులు జగన్ కట్టారా? అని అమిత్ షా అడిగారు. ఇంకా చెల్లించలేదని చంద్రబాబు బదులిచ్చారు.
‘‘హరిత ట్రైబ్యునల్ చాలా శక్తివంతమైంది. మేం గతంలో అండమాన్‌లో పర్యాటకుల కోసం ఒక భవనం కడితే ఇలాగే భారీ జరిమానా వేశారు. దానికోసం అనేకసార్లు మాట్లాడి కొంత తగ్గించగలిగాం. జరిమానా కట్టడం తప్ప వేరే మార్గం లేదు’’ అని అమిత్ షా తన అనుభవం వివరించారు. జగన్ ఏం చేస్తున్నారు… తిరుగుతున్నారా.. అని అమిత్‌షా అడిగారు. ప్రకటనలు ఇవ్వడం తప్ప ఇంతవరకూ పెద్దగా తిరుగుతోంది లేదని, సుదీర్ఘ యాత్రలు చేయబోతున్నానని లీకులు మాత్రం ఇస్తున్నారని లోకేశ్ వ్యాఖ్యానించారు.కాగా, టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని అమిత్‌షాను సీఎం చంద్రబాబు కోరారు. ఆయన తప్పనిసరిగా ఇవ్వాల్సిన వ్యక్తి అని అమిత్ షా వ్యాఖ్యానించారు. తాను దానిపై ఒక లేఖను కూడా ఇచ్చానని పురందేశ్వరి ఆయనకు చెప్పారు.
తెలుగు ప్రధాని పీవీ నర్సింహారావును గుర్తు చేసుకొన్న ఆయన పీవీ ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా చేశారు… ఎంత కాలం ఉన్నారని అడిగారు. ‘‘ఆయన కేవలం పదిహేను నెలలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం అప్పట్లో పదేపదే ముఖ్యమంత్రులను మార్చేది’’ అని చంద్రబాబు తెలిపారు. ఆ పార్టీ తరపున ఎక్కువ కాలం ఎవరు ముఖ్యమంత్రిగా చేశారని అమిత్ షా అడిగారు. ‘‘వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరేళ్లు చేశారు. కాసు బ్రహ్మానంద రెడ్డి ఆయన కంటే కొంత ఎక్కువ కాలం చేసినట్లు గుర్తు’’ అని చెప్పారు.
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ తిరిగి కోలుకోవడానికి కేంద్రం ఉదారంగా సాయం చేయడం పట్ల అమిత్‌షాకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. అమరావతి రాజి ర్మాణం, పోలవరం ప్రాజెక్టు పురోగతిని ఆయనకు వివరించారు. రాష్ట్రంలోని రాయలసీమ, ఉత్తరాంధ్ర బాగా వెనకబడిన ప్రాంతాలని, వాటిని అభివృద్ధి పథంలోకి తేవడానికి పోలవరం- బనకచర్ల అంతర్గత నదుల అనుసంధానం ప్రాజెక్టు ఎంతో కీలకమని ఆయనకు చంద్రబాబు వివరించారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా దీనికి సాయం చేయాలని కోరారు.
More Stories
ఏపీలో ఆలయాలకు స్వతంత్ర ప్రతిపత్తి
కొత్త సీఈసీగా జ్ఞానేశ్‌కుమార్
తెలంగాణాలో ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో!