కాల్పుల విరమణకు ఇజ్రాయిల్- హమాస్ అంగీకారం

కాల్పుల విరమణకు ఇజ్రాయిల్- హమాస్ అంగీకారం
గత 15 నెలలుగా ఇజ్రాయెల్‌-హమాస్‌ ఉగ్రవాదుల మధ్య జరుగుతున్న యుద్ధానికి తెరపడింది. ఇరు వర్గాలు కాల్పుల విరమణకు అంగీకరించినట్టు బుధవారం మధ్యవర్తులు ప్రకటించారు. ఇజ్రాయిల్‌ – హమాస్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఖరారైనట్లు ఓ అధికారి తెలిపారు. 
 
అయితే కొన్ని సాంకేతికపరమైన చిక్కుల వల్ల ఒప్పందం వెల్లడి జాప్యం జరుగుతోందని ఆ అధికారి రాయిటర్స్‌ వార్తా సంస్థకు తెలిపారు. దీంతో  కొన్ని వారాల క్రితం నుంచి ఖతార్‌ రాజధానిలో ఎడతెరపి లేకుండా జరిగిన చర్చల అనంతరం ఈ కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని తెలిపారు. దీనిలో భాగంగా హమాస్‌ చేతిలో ఉన్న డజన్ల కొద్దీ బందీలను విడతల వారీగా విడుదల చేస్తారు.
 
డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రమాణస్వీకారానికి ముందే అంటే ఈ నెల 21కి ముదే కొందరు బందీలను హమాస్‌ విడుదల చేయొచ్చని ఇజ్రాయిల్‌ భావిస్తోంది. ముసాయిదా ఒప్పందం ప్రకారం, గాజాలో ఆరు వారాల పాటు కాల్పుల విరమణ జరగాలి. హమాస్‌ చెరలో వున్న ఇజ్రాయిల్‌ బందీలు, అాగే ఇజ్రాయిల్‌ జైళ్లలో వున్న వందలాదిమంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయాల్సి వుంటుంది.
 
మొదటి దశలో ఇజ్రాయిల్‌ బలగాలు గాజా నుండి వైదొలగాలి. ఉధృత దాడుల కారణంగా ఇళ్లు వీడి వెళ్లిన పాలస్తీనియన్లు తిరిగి వెనక్కి రావాల్సి వుంటుంది. మొదటి దశ తర్వాత కూడా కాల్పుల విరమణ అమల్లో వుంటుందా లేదా అన్నది ప్రశ్నగా మిగిలివుంది. రాబోయే వారాల్లో మరిన్ని చర్చలు జరగాల్సి వుంది. ఆ చర్చల ఫలితంపై ఇదంతా ఆధారపడి వుంటుంది.
 
గాజా పాలనకు సంబంధించి నెలకొల్పాల్సిన యంత్రాంగంపై కూడా తేల్చుకోవాల్సి వుంటుంది. రెండో దశ ప్రారంభం కావడానికి ముందు ఈ 42 రోజుల్లో ఎలాంటి ఒప్పందం లేకపోతే గాజాపై మళ్లీ ఇజ్రాయిల్‌ దాడులు పునరుద్ధరించవచ్చు.  ఒప్పందం జరిగిన విషయాన్ని ముగ్గురు అమెరికా అధికారులు, ఒక హమాస్‌ ప్రతినిధి నిర్ధారించగా, పూర్తి వివరాలు రావాల్సి ఉందని ఇజ్రాయెల్‌ సీనియర్‌ అధికారి తెలిపారు.