హెచ్‌-1బి వీసా రగడతో భారతీయ ఉద్యోగుల్లో ఆందోళన

హెచ్‌-1బి వీసా రగడతో భారతీయ ఉద్యోగుల్లో ఆందోళన

అమెరికాలో హెచ్‌-1బి వీసా సంస్కరణలపై వాడిగా, వేడిగా చర్చ కొనసాగుతున్న వేళ దేశంలోని వృత్తి నిపుణులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అమెరికాలో అధికారంలోకి రాబోతున్న డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం కఠినమైన ఇమ్మిగ్రేషన్‌ విధానాన్ని ప్రవేశపెట్టబోతోందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆఫర్‌ లెటర్లు పొందిన ఐటి నిపుణులకు ఆశాభంగం ఎదురవుతోంది. ఆ లెటర్లను కంపెనీలు ఉపసంహరించుకుంటున్నాయి. వీసాలు ఆలస్యమవుతున్నాయి. లేఔట్ల హెచ్చరికలు వినిపిస్తున్నాయి.

తమకు ఇచ్చిన జాబ్‌ ఆఫర్‌ లెటర్లను వీసా సంబంధిత సమస్యల కారణంగా కంపెనీలు రద్దు చేస్తున్నాయని కొందరు నిపుణులు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను అమెరికాలోని టెక్‌ సంస్థ డిసెంబరులో ఉద్యోగంలోకి తీసుకుంది. విధుల్లో చేరడానికి శాన్‌ఫ్రాన్సిస్కో బయలుదేరేందుకు సిద్ధపడుతుండగా అశనిపాతం వంటి వార్త వచ్చింది. ఆమెకు ఇచ్చిన ఆఫర్‌ను కంపెనీ వెనక్కి తీసుకుంది. 

కొత్త ఉద్యోగంలో చేరబోతున్నానన్న ఆనందంలో ఆమె ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఇప్పుడు ఆ ఇంజినీర్‌ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారింది. ‘2024 డిసెంబర్‌లో నాకు జాబ్‌ ఆఫర్‌ వచ్చింది. నాకు లిఖితపూర్వకంగా సమాచారం అందడంతో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేశాను. ఇప్పుడు ఏం చేయాలి?’ అంటూ ఆవేదనతో ప్రశ్నించారు.

వీసా నిబంధనల్లో వచ్చిన మార్పుల కారణంగా ఆఫర్‌ లెటర్‌ను వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందని కంపెనీ చెబుతోంది. దీనిపై ఆ మహిళా ఇంజినీర్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘నన్ను మోసం చేశారు. వీసా స్పాన్సర్‌ చేయగలమా? లేదా అనే విషయాన్ని నిర్ధారించుకోకుండానే నాకు ఉద్యోగం ఎలా ఇచ్చారు? పరిస్థితి చక్కబడిన తర్వాత మళ్లీ ఆఫర్‌ లెటర్‌ ఇస్తామని వారు చెబుతున్నారు.

డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత నిర్దిష్టంగా నిర్ణయం తీసుకుంటామని అంటున్నారు. కానీ నేను ఎంతకాలం ఎదురు చూడాలి?’ అని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ అందజేసిన సమాచారం ప్రకారం 2023లో జారీ చేసిన 3,80,000 హెచ్‌-1బీ వీసాల్లో 72 శాతం భారతీయులకే అందాయి. వీరిలో చాలా మంది డాటా సైన్స్‌, ఎఐ, మెషిన్‌ లెర్నింగ్‌, సైబర్‌ సెక్యూరిటీ వంటి రంగాల్లో పనిచేస్తున్నారు. 

వీరికి ఏటా రూ.1.01 కోట్ల వార్షిక వేతనం అందుతోంది. అమెరికా ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా హెచ్‌-1బి కార్యక్రమాన్ని సంస్కరించాలని ట్రంప్‌ ప్రభుత్వం భావిస్తున్నందున మున్ముందు సవాళ్లు తప్పవని అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు హెచ్‌-1బి వీసా అంటేనే మండిపడుతున్న ‘మాగా’ ఉద్యమకారులు మనపై కారాలు మిరియాలు నూరుతున్నారు. ఈ కార్యక్రమం అమెరికా ఉద్యోగాలు, వేతనాలను దెబ్బతీస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

కాగా వీసా రెన్యువల్స్‌ కోసం ఎదురు చూస్తున్న వారిని నిరుద్యోగ భయం వెంటాడుతోంది. హెచ్‌-1బీ వీసా స్పాన్సర్‌షిప్‌ ఆలస్యమవుతుండడంపై లాస్‌ ఏంజెల్స్‌లోని సైబర్‌ సెక్యూరిటీ కన్సల్టెంట్‌ మాట్లాడుతూ ‘ఈ ప్రక్రియను వేగవంతం చేస్తామని మొదట్లో కంపెనీ హామీ ఇచ్చింది. ఇప్పుడేమో వీసా సంస్కరణలపై స్పష్టత కోసం ఎదురు చూస్తున్నామని చెబుతోంది. ఈ ఎదురు చూపులు ఆవేదన కలిగిస్తున్నాయి’ అని చెప్పారు.

మాస్టర్‌ డిగ్రీ కోసం నాగపూర్‌ నుండి అమెరికా వెళ్లిన మరో యువతి భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంది. ‘ఈ ఏడాది మార్చిలో వీసా లాటరీ కోసం నా పేరు రిజిస్టర్‌ చేస్తామని చెప్పారు. అయితే వారు ఇప్పటికీ ఆ ప్రక్రియ ప్రారంభ దశలను మొదలు పెట్టలేదు. మా హెచ్‌-1బిని తర్వాత ఫైల్‌ చేస్తారా? లేక చివరికి మొండిచేయి చూపుతారా?’ అని ఆమె మథనపడుతున్నారు. 

తెలంగాణకు చెందిన ఓ మహిళ వ్యథ మరోలా ఉంది. ఉద్యోగం కోసం ఎదురు చూపుల అనంతరం ఆమె ఇటీవలే డాటా అనలిస్ట్‌గా ఎంపికైంది. వీసా స్పాన్సర్‌షిప్‌ గురించి ఇప్పుడు ఏమీ చెప్పడం లేదు. మరోసారి నన్ను నిరుద్యోగం వెంటాడుతుందా? ఏమో…’ అని దిగాలుగా ఉన్నారు. కాలిఫోర్నియాలో పనిచేస్తున్న ఓ సాఫ్ట్‌వేరే డెవలపర్‌ ఏమంటున్నారంటే ‘నాకు వీసా ఉంది. అయితే మా కంపెనీ ఇటీవలే ఉద్యోగుల తొలగింపును ప్రకటించింది. 

అదే ఆందోళన కలిగిస్తోంది. ఈ తొలగింపులకు, వీసా సమస్యకు ఏదైనా సంబంధం ఉన్నదా అనే విషయంపై మా కంపెనీ స్పష్టత ఇవ్వడం లేదు. ఒకవేళ ఉద్యోగం పోతే 60 రోజుల్లో మరోటి వెతుక్కోవాల్సి ఉంటుంది. అప్పుడే ఇక్కడ ఉండగలం’ అని చెప్పారు. నిరుద్యోగం రికార్డు స్థాయిలో ఉన్నదని, భారతీయ ఇమ్మిగ్రెంట్లలో అస్థిరత పెరుగుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో తక్కువ సమయంలో హెచ్‌-1బి స్పాన్సర్‌షిప్‌తో కొత్త ఉద్యోగం దొరకడం కష్టమేనని ఆయన పెదవి విరిచారు.

నిబంధనలు కఠినంగా ఉండడంతో యాజమాన్యాలు విదేశాలకు చెందిన వారిని ఉద్యోగాల్లోకి తీసుకోవడానికి వెనకాడుతున్నారని, స్పాన్సర్‌షిప్‌ల కోసం పెట్టుబడులు పెట్టి తీరా అవి తిరస్కరణకు గురైతే పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారని జార్జియాకు చెందిన ఇమ్మిగ్రేషన్‌ న్యాయవాది తెలిపారు. దురదృష్టవశాత్తూ ఈ అస్థిరతను ఉద్యోగులే భరించాల్సి వస్తోందని ఆయన అన్నారు.