రూ.24.69 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి

రూ.24.69 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి
దేశీయ స్టాక్‌ మార్కెట్లు నాలుగు రోజులుగా ‘బేర్‌’మంటున్నాయి. నాలుగు సెషన్లలో ఇన్వెస్టర్లు రూ.24.69 లక్షల కోట్ల సంపద కోల్పోయారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పెరుగుదల, నిరంతరం విదేశీ నిధుల ఉపసంహరణతోపాటు ఉద్యోగాల కల్పన మెరుగుదలతో యూఎస్‌ ఫెడ్‌ రిజర్వ్‌ కీలక వడ్డీరేట్లు తగ్గింపు అవకాశాలు సన్నగిల్లాయి. 
 
మరోవైపు, ఫారెక్స్‌ మార్కెట్‌లో అమెరికా డాలర్‌పై రూపాయి మారకం విలువ గత రెండేండ్లలో తొలిసారి జీవిత కాల కనిష్టానికి పతనమైంది.  ఫలితంగా ఇన్వెస్టర్లలో సెంటిమెంట్‌ బలహీన పడింది. దీంతో బీఎస్‌ఈ ఇండెక్స్‌ సెన్సెక్స్‌ గత శుక్రవారం.. 1048.90 పాయింట్ల నష్టంతో 76,330.01 పాయింట్ల వద్ద ముగిసింది.
 
బీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.24,69,243.3కోట్లు కోల్పోయి రూ.4,17,05,906.74 కోట్ల వద్ద నిలిచింది. అంతే కాదు శుక్రవారం ట్రేడింగ్‌ ముగిసిన తర్వాత బీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 4.82 లక్షల కోట్ల డాలర్ల దిగువకు పతనమైంది. సోమవారం ఇన్వెస్టర్లు రూ.12.61 లక్షల కోట్లు కోల్పోయారు.సెగెటివ్ సెంటిమెంట్‌ నేపథ్యంలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు ఈ నెలలో రూ.20 వేల కోట్ల విలువ గల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. రష్యా ముడి చమురు దిగుమతులపై అమెరికా ఆంక్షలు విధించడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడాయిల్‌ 1.43 శాతం పుంజుకుని 80.90 డాలర్ల వద్ద ట్రేడయింది. బీఎస్‌ఈలో 3562 షేర్లు నష్టపోగా, 555 స్టాక్స్‌ లాభ పడ్డాయి. మరో 131 స్టాక్స్‌ యథాతథంగా కొనసాగాయి.