భక్తజనం అంతా వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం సిద్ధం అవుతున్న తరుణంలో బుధవారం రాత్రి విషాద ఘటన తిరుపతిలో చోటు చేసుకోవడం ఒక్కసారి గా అందరిలో కలకలం రేపింది. వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్ల క్యూ లో ఆరుగురు మృతువాత పడటం అందరిని షాక్ కు గురి చేసింది. కేవలం ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం, తిరుమల తిరుపతి దేవస్థానం అత్యున్నత పాలకవర్గంలో సమన్వయం లోపించిన కారణంగానే ఏర్పాట్లలో ఘోర నిర్లక్ష్యం చోటుచేసుకున్నట్లు స్పష్టం అవుతుంది.
“తిరుపతిలో టికెట్లు ఇవ్వడం గతంలో లేని సంప్రదాయం. వైకుంఠ దర్శనాన్ని 10 రోజులకు పెంచారు అలా ఎందుకు పెంచారో తెలియదు. తిరుమలలో మొదటి నుంచి ఉన్న సంప్రదాయాలు మార్చడం మంచిది కాదు. ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ పద్ధతులు ఉండాలి. ఏ ఆలయంలోనూ ఇలాంటి అపచారాలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటాం” అని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విస్మయం వ్యక్తం చేశారంటే టిటిడి పాలనా యంత్రంగం నిర్వాకం వెల్లడి అవుతుంది.
డీఎస్పీ రమణ కుమార్, గోశాల డైరెక్టర్ హరనాథరెడ్డి బాధ్యత లేకుండా వ్యవహరించారని ఈ క్రమంలో వీరిని సస్పెండ్ చేస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఎస్పీ సుబ్బరాయుడు, జేఈవో గౌతమి, సీఎస్‌వో శ్రీధర్‌ను తక్షణమే బదిలీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు. అయితే కీలకమైన బాధ్యులపై చర్యలు తీసుకోలేక, మొక్కుబడిగా ఈ చర్యలు తీసుకున్నట్లు స్పష్టం అవుతుంది. ఇక్కడ ఎన్ని అక్రమాలు జరిగినా, పాలనా వైఫల్యాలను జరిగినా ప్రభుత్వం ఏమీచేయలేదనే ధైర్యాన్ని ఓ విధంగా ముఖ్యమంత్రి ఇచ్చినట్లు వెల్లడి అవుతుంది.
అత్యంత కీలక సమయంలో అందరూ సమన్వయంతో సాగాల్సిన వేళ టీటీడీ చైర్మన్ బి ఆర్ నాయుడు, టీటీడీ ఈఓ శ్యామల రావు, అదనపు ఈఓ వెంకయ్య చౌదరి లు ఎవరికీ వారే అన్న చందంగా వ్యవహరించటం కూడా తాజా పరిస్థితికి కారణం అవుతోందని చెపుతున్నారు. వారు ముగ్గురు ఎవ్వరికీ వారుగా వ్యవహరిస్తున్నారని, పైగా కీలక నిర్ణయాలు తీసుకోలేక పోతున్నారని విమర్శలు కొంతకాలంగా చెలరేగుతున్నాయి.
ముఖ్యమంత్రి ముందే ట్రస్ట్ బోర్డు చైర్మన్, ఈఓ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం గమనిస్తే పాలనాయంత్రాంగం కుప్పకూలిన్నట్లు స్పష్టం అవుతుంది. సమర్ధతను పరిగణలోకి తీసుకోకుండా ఇతరత్రా కారణాలచేత టిటిడిలో కీలక నీయమకాలు జరుగుతూ ఉండటం కారణంగా కొంతకాలంగా టీటీడీ పాలనాయంత్రాంగం బ్రష్టు పట్టి పోతున్నది.
ఒక వైపు చైర్మన్ బిఆర్ నాయుడు పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉందని, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినట్లు మీడియా సాక్షిగా ప్రకటించారు. ఐదు వేల మంది సిబ్బందితో భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పినా కూడా దురదృష్టకర ఘటన జరిగింది అని అయన మీడియా ముందే వాపోయారు. చైర్మన్ తో పాటు ఈఓ శ్యామల రావు, అదనపు ఈఓ వెంకయ్య చౌదరి ల మధ్య అసలు ఏమాత్రం సమన్వయం లేదు అని టీటీడీ వర్గాలు చెపుతున్నాయి.
ఎవ్వరు ఏ పనిమీద వారి వద్దకు వెళ్లినా, ఎటువంటి సూచనతో వెళ్లినా తమను ఆ పదవులలో నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేదా మంత్రి నారా లోకేష్ ల నుండి సిఫార్సు ఉంటేగాని పరిశీలింపమని నిస్సహాయత వ్యక్తం చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మరోవంక, ఇటువంటి కీలక సమయాలలో టీటీడీ అధికారులతో కలిసి పని చేయాల్సిన జిల్లా కలెక్టర్ కూడా ఇవేమి పట్టించుకున్నట్లు లేదనే విమర్శలు వస్తున్నాయి.
ఇటీవల రాజమండ్రిలో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమం గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగం చూపిన ఆసక్తిలో ఏమాత్రం తిరుపతి పట్ల చూపినా ఇటువంటి ఉపద్రవం ఎదురయ్యేది కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అక్కడ ఏకంగా సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కందుల దుర్గేష్ తో పాటు జిల్లా అధికారులు ముందుగా వేదికగా దగ్గరకు పోయి అన్ని ఏర్పాట్లు పరిశీలించి వచ్చారు.
కానీ ప్రతి ఏటా తిరుమలలో జరిగే వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాట్లు సరిగా ఉన్నాయా లేదా అన్న విషయంపై ప్రభుత్వం ఏ మాత్రం దృష్టి పెట్టిన దాఖలాలు లేవని చెపుతున్నారు. కనీసం దేవాదాయ శాఖ మంత్రి వచ్చి సమీక్ష జరిపిన దాఖలాలు కూడా లేవు. బైరాగిపట్టెడలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి కలెక్టర్, ఎస్పీపై, అలాగే టీటీడీ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు గాని, తక్షణ చర్యలు ఏవీ ప్రకటించలేదు.
ఇది క్షమించాల్సిన తప్పు కాదంటూ టికెట్లు పంపిణీ కేంద్రంలో తొక్కిసలాట నియంత్రణకు ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకున్నారని అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే వెంటనే ఒక సీనియర్ అధికారిపై క్రమశిక్షణ చర్యను ప్రకటించి ఉంటె అధికార యంత్రాంగం భవిష్యత్ లో అప్రమత్తంగా వ్యవహరించే అవకాశం ఉండేదని అధికార వర్గాలే భావిస్తున్నాయి.
ఇందులో కుట్ర కోణం గురించి దర్యాప్తు చేస్తున్నామని చెప్పడం ద్వారా హోమ్ మంత్రి కె అనిత, మరొకొందరు టీడీపీ నేతలు ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. బాధ్యతలు నిర్వర్తించడంలో టీటీడీ ఈవో శ్యామలరావు, జేఈవో వెంకయ్య చౌదరి విఫలమయ్యారని ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేయడం గమనార్హం. ఈ ఘటనను బాధ్యతగా తీసుకోవాలని పేర్కొంటూ వారిద్దరిపై క్రమశిక్షణాచర్య తీసుకోవాలని పరోక్షంగా సూచించారు. అధికారులు చేసిన తప్పిదానికి ప్రభుత్వం నిందలు మోస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీలో ప్రక్షాళన జరగాల్సి ఉందని పేర్కొన్నారు గాని ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్య ధోరణిని ప్రస్తావించని లేదు. ఒక విధంగా ముఖ్యమంత్రి నిస్సహాయతను ఆయన ప్రశ్నించినట్లు స్పష్టం అవుతుంది.
వైకుంఠ ఏకాదశి దర్శనం కేవలం ఒక రోజు మాత్రమే ఉంటుంది. వైసిపి హయాంలో ఎటువంటి శాస్త్రసంబంధ ప్రసక్తి లేకుండా ఆదాయం కోసం పది రోజులపాటు చేయడం ప్రారంభించారు. ఈ విషయమై హైకోర్టుకు ఒకరు వెళ్లినా జోక్యానికి న్యాయస్థానం నిరాకరించింది. వైసిపి అక్రమాలపై నిత్యం గొంతెత్తి టిడిపి నేతలు వాటిని సరిదిద్దే ప్రయత్నం చేయక పోవడంతోనే ఇటువంటి దుర్ఘటనలు చోటుచేసుకొంటున్నాయి.
More Stories
మంత్రులతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు
భార్యతో సెల్ఫీతోనే మావోయిస్టు చలపతి హతం!
పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ దాడులు