ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా దోమకాటుకు గురై లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు విజృంభించి ప్రజల ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నాయి. ప్రతి రోజూ రాత్రి ఇళ్లల్లో గుడ్ నైట్, ఆల్‌ఔట్ వంటివి దోమల నివారణ మందులు పెట్టనిదే నిద్రపోరంటే అతిశయోక్తి కాదు. అయితే దోమల బెడద నిర్మూలించేందుకు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు కొత్త ప్రయోగంతో ముందుకు వచ్చారు. ఇది విజయవంతం అయితే దోమకాటు మరణాలు ఉండకపోవచ్చని భావిస్తున్నారు.
దోమకాటు వల్ల వ్యాపిస్తున్న ప్రాణాంతక వ్యాధుల నుండి ప్రజలను కాపాడేందుకు ఆస్ట్రేలియాలోని మాక్వేరీ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు సరికొత్త ప్రయోగం చేశారు. ముఖ్యంగా వ్యాధులు సోకడానికి ప్రధాన కారణమైన ఆడ దోమలకు చెక్ పెట్టేలా శాస్త్రవేత్తలు కొత్త ప్రయోగంతో ముందుకొచ్చారు. ఉష్ణమండల ప్రాంతాల్లో దోమకాటు వల్ల డెంగీ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలుతున్నాయి.
వాటి కట్టడి కోసం ఆస్ట్రేలియాలోని మాక్వేరీ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు సరికొత్త ప్రయోగం చేశారు. మనుషులను కుట్టే ఆడ దోమలతో సంభోగం జరిపే మగ దోమల వీర్యాన్ని విషపూరితం చేయాలని, ఇలా చేయడం వల్ల పురుగుమందుల్లా ఇతర ప్రయోజనకర జాతులకు నష్టం జరగకుండానే దోమల బెడదను నివారించొచ్చని వెల్లడించారు.
దీనికి సంబంధించి ఈగల్లో జరిపిన ప్రయోగంలో ఆడ ఈగల జీవితకాలం గణనీయంగా తగ్గిపోయినట్లు గుర్తించామని పేర్కొన్నారు. అయితే దీనివల్ల మనుషులు, ఇతర జాతులకు ఎలాంటి హానిలేదని నిర్థారించుకున్న తరువాతే ఆ ప్రయోగాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసే దిశగా ముందుకు వెళతామని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి మగ దోమల్లో జన్యుపరమైన మార్పులు చేసి వాటి వీర్యాన్ని విషంగా మార్చనున్నారు.
దోమల నివారణకు రసాయన పురుగుమందులు వాడడంతో ఇతర జీవులు, మనుషులకు సైతం హానికరంగా మారుతోంది. అయితే తాము అభివృద్ధి చేస్తున్న నూతన పద్ధతిలో కేవలం హానికరమైన ఆడదోమలను మాత్రమే చంపేందుకు అవకాశం ఉంటుందని మాక్వేరీ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్త సామ్ బీచ్ చెబుతున్నారు. దీంతో మలేరియా, డెంగ్యూ జ్వరం వంటి వ్యాధుల వ్యాప్తి గణనీయంగా తగ్గుతుందని ఆయన చెప్పారు.ఈ విధానాన్ని ఇప్పటికే ఈగలపై ప్రయోగించినట్లు మరో శాస్త్రవేత్త మజీజ్ మసెల్కో వెల్లడించారు. విషపూరిత వీర్యాన్ని కలిగి ఉన్న మగ ఈగలు ఆడ ఈగలతో సంభోగం చేసిన తర్వాత ఆడ ఈగల జీవిత కాలం గణనీయంగా తగ్గిపోయినట్లు పరిశోధనలో గుర్తించినట్లు ఆయన చెప్పారు. ఇదే పద్ధతిని దోమలపైనా అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
More Stories
జమిలీ ఎన్నికలపై 31న జేపీసీ రెండో సమావేశం
బిజెపి ఎంపీలపై క్రిమినల్ కేసు కొట్టివేత
8 రోజుల్లో 9 కోట్ల మంది పుణ్యస్నానాలు