ఢిల్లీ సీఎం, ఆప్ ఎంపీ లపై కాంగ్రెస్ నేత పరువు నష్టం కేసు

ఢిల్లీ సీఎం, ఆప్ ఎంపీ లపై కాంగ్రెస్ నేత పరువు నష్టం కేసు

ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి, ఆప్‌ రాజ్యసభ ఎంపి సంజయ్ సింగ్‌పై పరువునష్టం కేసు వేయనున్నట్లు కాంగ్రెస్‌ నేత, ఈస్ట్‌ ఢిల్లీ మాజీ ఎంపి సందీప్‌ దీక్షిత్‌ మంగళవారం తెలిపారు. బిజెపి నుండి తాను పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నట్టు గతవారం అతిషి ఆరోపించారని ఆయన పేర్కొన్నారు.

గత 10-12 ఏళ్లుగా కాంగ్రెస్‌ను, తనను, తన కుటుంబాన్ని వారు టార్గెట్‌  చేసుకున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పది పన్నిండేళ్లుగా ‘ఆప్‌’ను ఆనేక ప్రశ్నలు వేశానని చెబుతూ కేజ్రీవాల్  షీలా దీక్షిత్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 360 పేజీల సాక్షాలున్నాయని చెప్పుకుని తిరిగే వారని ఆయన గుర్తు చేశారు.

‘‘ కేజ్రీవాల్‌ సిఎం అయిన తర్వాత షీలా దీక్షిత్‌పై సాక్ష్యాలను అడుగుతూ బిజెపి ప్రతినిధి బృందం  ఆయనను కలిసింది. అరవింద్‌ కేజ్రీవాల్‌ 360 పేపర్‌ కటింగ్‌లు తమకు చూపించినట్టు బిజెపి నేత విజయ్  కుమార్‌ మల్హోత్రా నాకు చెప్పారు. పేపర్‌ కటింగ్‌లను సాక్ష్యాలుగా చూపించిన మొదటి వ్యక్తి కేజ్రీవాల్‌” అని సందీప్‌ దీక్షిత్‌ ధ్వజమెత్తారు.  

బిజెపి నుండి తాను డబ్బులు తీసుకున్నట్లు అతిషి ఆరోపించిన రోజే మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మరణించారని, దీంతో తాను మీడియా సమావేశం ఏర్పాటు చేయలేదని ఆయన చెప్పారు.  ఈరోజు మీడియా సమావేశం పూర్తి కాగానే అతిషి, సంజయ్ సింగ్‌పై రూ.10 కోట్లకు సివిల్‌, క్రిమినల్‌ కేసులు వేస్తానని ఆయన ప్రకటించారు. 

రూ.5 కోట్లు యమునా జలాల ప్రక్షాళన, ఢిల్లీలోని వాయుకాలుష్య నిరోధక చర్యల కోసం రూ.5 కోట్లు విరాళంగా ఇస్తానని తెలిపారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ కుమారుడైన సందీప్‌ దీక్షిత్‌  అసెంబ్లీ ఎన్నికలలో  న్యూఢిల్లీ నియోజకవర్గం నుండి  పోటీ చేస్తున్నారు.

మరోవంక, మహిళా సమ్మాన్ యోజన  పధకం పెరిగే ఆప్ కార్యకర్తలు ఢిల్లీలోని మహిళల ఫోన్ నంబర్లు, చిరునామాలు సేకరిస్తూ, వారితో ఫారాలను పూర్తి చేయిస్తూ మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ గత వారం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా కు ఆయన వినతిపత్రం సమర్పించారు. ఏ రాజకీయ పార్టీ అయినా కొత్త పధకాన్ని ప్రకటించి, ప్రజలకు హామీలు ఇవ్వొచ్చని, అయితే, ఇప్పటికే రూ 1,000 చొప్పున మహిళలకు ఇస్తున్న పధకాన్ని రూ 2,100 చొప్పున ఇస్తామని ఇప్పుడు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు.