అమెరికా ఖజానాపై చైనా హ్యాకర్ల సైబర్ దాడి!

అమెరికా ఖజానాపై చైనా హ్యాకర్ల సైబర్ దాడి!

అగ్రరాజ్యం అమెరికా  చైనాపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. తమ ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌ నెట్​వర్క్​పై చైనా హ్యాకర్లు సైబర్ దాడులకు పాల్పడినట్లు గుర్తించామని తెల్పింది. వర్క్‌స్టేషన్లను యాక్సెస్ చేసి, కీలకమైన పత్రాలను దొంగిలించేందుకు చైనా హ్యాకర్లు ప్రయత్నించినట్లు పేర్కొంది. 

అమెరికా ట్రెజరీ డిపార్ట్​మెంట్​ – కాంగ్రెస్‌కు రాసిన లేఖలో ఈ విషయాలను వెల్లడించినట్లు ఓ మీడియా సంస్థ బయటపెట్టింది.”వాస్తవానికి ఈ నెల ప్రారంభంలోనే సైబర్‌ దాడి జరిగింది. థర్డ్‌ పార్టీ సైబర్‌ సెక్యూరిటీ సర్వీస్‌ ప్రొవైడర్స్ సాయంతో హ్యాకర్లు – అమెరికా ట్రెజరీ వర్క్‌స్టేషన్లతో సహా, కీలకమైన దస్త్రాలను యాక్సెస్ చేయగలిగారు. అయితే డిసెంబర్‌ 8న బియాండ్‌ట్రస్ట్‌ ప్రొవైడర్‌ దీనిని గుర్తించింది. వెంటనే అప్రమత్తమై ఈ విషయాన్ని ట్రెజరీ విభాగానికి తెలిపింది” అని ట్రెజరీ డిపార్ట్​మెంట్ అధికార ప్రతినిధి తెలిపారు.

 అనంతరం చైనా హ్యాకర్లు చేసిన సైబర్​ దాడి గురించి, సైబర్‌ సెక్యూరిటీ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ(సిఐఎస్ఏ), ఎఫ్‌బీఐ దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. దీని వల్ల ఎంత మేర నష్టం వాటిల్లిందనేది అంచనా వేస్తోన్నామని తెలిపింది. అయితే దీనిపై ఎఫ్‌బీఐ అధికారులు స్పందించలేదు. కాగా, వాషింగ్టన్‌లోని బీజింగ్‌ రాయబార కార్యాలయం ఈ ఆరోపణలను ఖండించింది. ‘ఎటువంటి వాస్తవ ఆధారాలు లేకుండా మాపై అమెరికా చేస్తున్న ఆరోపణలను గట్టిగా వ్యతిరేకిస్తున్నాం’ అని పేర్కొంది. 

మరోవైపు జార్జియాలోని బియాండ్‌ ట్రస్ట్‌ సైతం ఈ సైబర్‌ దాడి గురించి స్పందించలేదు. అయితే, వారి వెబ్‌సైట్‌లో ఇటీవల తమ కస్టమర్ల భద్రత ముప్పునకు సంబంధించిన ఘటనలు గుర్తించినట్లు తెలిపింది. దీనిపై దర్యాప్తు జరుగుతున్నట్లు వెల్లడించింది. ‘బియాండ్‌ ట్రస్ట్‌ వివరించిన సైబర్​ ఎటాక్​ – ట్రెజరీ నివేదించిన హ్యాకింగ్‌ ఘటనకు దగ్గరగా ఉన్నట్లు గుర్తించాం. అయినప్పటికీ ఈ ఘటనపై విచారణ జరగాల్సి ఉంది’ అని ఓ సైబర్‌ సెక్యూరిటీ కంపెనీ అధికారి పేర్కొన్నారు.

ఈ సైబర్ అటాక్ ద్వారా చైనా ఎలాంటి సమాచారం గానీ, డాక్యుమెంట్లను పొందగలిగింది?, అవి- ఏఏ రంగాలకు సంబంధించినవి?, వాటి వల్ల భవిష్యత్తులో ఎలాంటి ముప్పు పొంచివుంది? అనే విషయాలపై ఎలాంటి వివరణ ఇవ్వలేదీ లేఖలో సెనెట్ బ్యాంకింగ్ కమిటీ. వాటి గురించి ఆరా తీస్తోన్నామంటూ క్లుప్తంగా పేర్కొంది.
 
 ఈ ఘటనపై ట్రెజరీ డిపార్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ అసిస్టెంట్ సెక్రెటరీ ఆదితి హర్దీకర్ స్పందిస్తూ దీనికి సంబంధించిన పూర్తి నివేదికను రూపొందించే పనిలో ఉన్నామని తెలిపారు. ఈ సైబర్ అటాక్‌ను తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్నామని, అన్ని శాఖలను అప్రమత్తం చేశామని ఆదితి చెప్పారు. ఈ దాడి ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై ఎంతమేర పడుతుందనేది ఆరా తీస్తోన్నామని వివరించారు. త్వరలోనే దీనిపై ఓ సమగ్ర నివేదికను రూపొందిస్తామని, దీన్ని హౌస్ ఫైనాన్షియల్ సర్వీస్ కమిటీకి అందజేస్తామని ఆదితి హర్దీకర్ తెలిపారు.
 
దాదాపుగా దేశవ్యాప్తంగా ఉన్ని ట్రెజరీ డిపార్ట్‌మెంట్స్‌కు సంబంధించిన వర్క్‌ స్టేషన్లు ఈ దాడి వల్ల తీవ్రంగా ప్రభావితమైనట్లు అమెరికా మీడియా సీఎన్ఎన్ తెలిపింది. ఈ దాడిపై థర్డ్ పార్టీ సాఫ్ట్‌వేర్ సర్వీస్ ప్రొవైడర్‌ను ఉటంకిస్తూ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. బియాండ్ ట్రస్ట్ అనే సాఫ్ట్‌వేర్ సంస్థ అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌కు థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్‌గా ఉంటోంది.