అటవీ జీవనాన్ని తోసిరాజి భారతీయ జీవనం కుదరదు

అటవీ జీవనాన్ని తోసిరాజి భారతీయ జీవనం కుదరదు
 
అటవీ జీవనాన్ని తోసిరాజి భారతీయ జీవనం కుదరదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబళే స్పష్టం చేశారు. నగరవాసి, గ్రామవాసులపాటు వనవాసుల మధ్య ఓ అనుసంధాన ప్రక్రియ అనే బృహత్ కార్యం జరగాలని ఆయన సూచించారు.  లేదంటే ఎవరి పనిలో వారు నిమగ్నమై పోతుంటారని పేర్కొంటూ అలా కాకుండా ఇతరుల గురించి కూడా ఆలోచించాల్సిన బాధ్యత అందరిపై ఉందని స్పష్టం చేశారు.
 
హైదరాబాద్ లో జరిగిన వనవాసీ కళ్యాణ ఆశ్రమం ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో విశిష్ట అతిధిగా పాల్గొంటూ హైందవా: సోదర సర్వే: అని ఆర్యోక్తి ఒకటి వుందని గుర్తు చేశారు.  హిందువులందరూ అన్నాదమ్ములు, అక్కాచెల్లెల్లని, అందరిదీ ఒకే రక్తమని చెప్పారు. నెల క్రితం భాగ్యనగర్ లో లోక్ మంథన్ కార్యక్రమాన్ని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభిస్తూ వనవాసి, గిరివాసి, నగరవాసి, గ్రామవాసి ఎవ్వరైనా అందరమూ భారత వాసులమేనని పేర్కొన్నారని హోసబళే ఈ సందర్భంగా గుర్తు చేశారు.
 
నగరాల్లో, గ్రామాల్లో నివసించే ప్రజలందరూ అడవులపైనే ఆధారపడి తమ జీవనాన్ని కొనసాగిస్తుంటారని చెబుతూ ఓ మానవుడు తన నిత్య జీవితంలో అవసరయ్యే ప్రతి వస్తువును అడవుల నుంచే తీసుకుంటున్నారని ఆయన గుర్తు చేశారు. ఇలా తీసుకోవడం మన అధికారం అనుకుంటామని, కానీ అడవినే ఆధారంగా చేసుకొని జీవనం సాగించే వారికి సేవ చేయడం కూడా మనందరి కర్తవ్యమని ఆయన సూచించారు.
 
కల్యాణాశ్రమం చాలా సంవత్సరాలుగా ఇదే పనిచేస్తోందని చెబుతూ వనవాసుల అస్తిత్వం, ఆత్మగౌరవం, వికాసం.. ఈ మూడు బిందువులను కేంద్రంగా చేసుకొని కల్యాణాశ్రమం పనిచేస్తూ వనవాసులకు సేవచేస్తోందని ఆయన చెప్పారు. అలాగే భారత దేశ అభివృద్ధిలో వీరి పాత్ర కూడా వుండేట్లు ఈ కార్యాన్ని ఓ తపస్సులా చేస్తోందని తెలిపారు.

సేవ అన్న ముసుగులో వనవాసులను తమ సంస్కృతి, మూలాల నుంచి వేరు చేసే శక్తులు కూడా పనిచేస్తుంటాయని హోసబలే హెచ్చరించారు. అలాగే అభివృద్ధి అన్న పేరుతో అడవులను నిర్మూలించడానికి కూడా ప్రయత్నాలు చేస్తుంటారని, అలాంటి సమయంలో వనవాసుల జీవితాలు కూడా ఇబ్బందుల్లోకి పడిపోతాయని ఆయన స్పష్టం చేశారు.
 
 అందుకే వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని, వనవాసులను రక్షించుకోవాల్సిన అవసరం మనందరి కర్తవ్యమని, ఈ సంకల్పాన్ని అందరి హృదయాల్లో జాగృతం చేయాలని దత్తాత్రేయ హోసబళే సూచించారు. 
 
తమ జీవితాలకు అవసరమైన వస్తువులను నిర్మాణం చేసుకున్నారని, ఆరోగ్య సంరక్షణ కోసం ఔషధాలను తయారు చేసుకున్నారని, జీవించడానికి అనేక అస్త్ర శస్త్రాలను తయారు చేసుకున్నారని, అలాగే అనేక రకాల పరికరాలను కూడా తయారు చేశారని ఆయన వివరించారు. ఇంత చేసినా వనవాసులు ప్రకృతిని మాత్రం వినాశనం చేయలేదని ఆయన గుర్తుచేశారు.
 
ఇలా ప్రకృతిని నాశనం చేయకుండా, ప్రకృతితో సమన్వయం చేసుకుంటూ సంస్కృతి సభ్యలను కాపాడుతూ సభ్య సమాజానికి వనవాసులు మార్గదర్శనం చూపిస్తున్నారని తెలిపారు. అందుకే అన్ని సమాజాల వారు వనవాసులకు కృతజ్ఞతలు తెలపాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.  అటవీ జీవనాన్ని తోసిరాజి భారతీయ జీవనం కుదరదని హోసబళే చెప్పారు. 
 
నగరాల్లో, గ్రామాల్లో నివసించే ప్రజలందరూ అడవులపైనే ఆధారపడి తమ జీవనాన్ని కొనసాగిస్తుంటారని తెలిపారు. ఓ మానవుడు తన నిత్య జీవితంలో అవసరయ్యే ప్రతి వస్తువును అడవుల నుంచే తీసుకుంటున్నారని గుర్తు చేశారు. ఇలా తీసుకోవడం మన అధికారం అనుకుంటామని, కానీ… అడవినే ఆధారంగా చేసుకొని జీవనం సాగించే వారికి సేవ చేయడం కూడా మనందరి కర్తవ్యమని సూచించారు. కల్యాణాశ్రమం చాలా సంవత్సరాలుగా ఇదే పనిచేస్తోందని చెప్పారు.
 
ముఖ్య అతిథిగా మెడికల్ అండ్ హెల్త్ సైన్సెస్ ఎండీ శ్రీమతి డా. కురసం పద్మజ, ఇక్సోరెల్, కార్తికేయ పరిశ్రమల గ్రూప్ సిఎండి శ్రీమతి భగవతి బల్ద్వాలతో పాటు వనవాసీ కల్యాణాశ్రమం అఖిల భారత ఉపాధ్యక్షులు డా. నాగు, వనవాసీ కల్యాణాశ్రమం తెలంగాణ ప్రాంత కార్యకారిణి సదస్యులు ఆచార్య అప్కా నాగేశ్వర రావు, వనవాసీ కల్యాణాశ్రమం దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన కార్యదర్శి తాడేపల్లి శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లి హనుమత్ ప్రసాద్ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.