ఈ కార్ రేసింగ్‌లో కేటీఆర్‌కు ఈడీ నోటీసులు

ఈ కార్ రేసింగ్‌లో కేటీఆర్‌కు ఈడీ నోటీసులు
ఫార్ములా – ఈ కార్ రేసింగ్‌లో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్‌(ఈడీ) నోటీసులు జారీ చేసింది. జ‌న‌వ‌రి 7వ తేదీన విచార‌ణ‌కు రావాల‌ని కేటీఆర్‌ను ఈడీ ఆదేశించింది. సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి అర‌వింద్ కుమార్‌, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డికి కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. 
 
అర‌వింద్, బీఎల్ఎన్ రెడ్డిలను జ‌న‌వ‌రి 2, 3వ తేదీల్లో విచార‌ణ‌కు రావాల‌ని నోటీసుల్లో ఈడీ పేర్కొంది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా పీఎంఎల్ఏ కింద ఈడీ విచార‌ణ చేప‌ట్టింది. ఫార్ములా ఈ-కార్‌ రేసుకు సంబంధించి ఏసీబీ కేసులో బీఆర్‌ఎస్‌ వరింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను ఈ నెల 31 వరకు అరెస్టు చేయవద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. గత విచారణ సందర్భంగా జారీ చేసిన ఉత్తర్వులను పొడిగించింది. 
 
కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దన్న ఉత్తర్వులను ఎత్తివేయాలని ఏసీబీ చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చింది. వాదనలు వినకుండా ఉత్తర్వులను జారీ చేయలేమని తేల్చిచెప్పింది. కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కే లక్ష్మణ్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 
 
ఈ-కార్‌ రేసుపై ఈ నెల 19న ఏసీబీ నమోదు చేసిన కేసును కేటీఆర్‌ హైకోర్టులో సవాలు చేశారు. ఆ కేసును కొట్టేయాలని కోరుతూ కేటీఆర్‌ ఈ నెల 20న హైకోర్టులో లంచ్‌ మోషన్‌ రూపం లో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.  దీనిపై శుక్రవారం జరిగిన విచారణలో కేటీఆర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదిస్తూ  రాజకీయ కుట్రతో అన్యాయంగా ఈ కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. ఈ కేసులో కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించాలని కోరారు.

అనంతరం కేటీఆర్‌ పిటిషన్‌పై ఏసీబీ తరఫున డీఎస్పీ మాజీద్‌ అలీఖాన్‌ కౌంటర్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎఫ్‌ఐఆర్‌లోని పలు అంశాలను పునఃప్రస్తావించారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నదని, ఇలాంటి తరుణంలో కోర్టు జోక్యం చేసుకొని నిందితులకు ఊరట కలిగేలా ఉత్తర్వులివ్వడం సరికాదని తెలిపారు. 

 
ఇలాంటి విషయాల్లో కోర్టులకు పరిమిత అధికారాలు మాత్రమే ఉంటాయని పేర్కొంటూ.. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఉటంకించారు. ఈ వాదన అనంతరం ఏసీబీ విజ్ఞప్తిని తోసిపుచ్చిన హైకోర్టు.. కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దన్న మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది.