డీఎంకేను గద్దె దింపే వరకూ చెప్పులు వాడను

డీఎంకేను గద్దె దింపే వరకూ చెప్పులు వాడను
బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షుడు కే అన్నామలై సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నుంచి రాష్ట్రంలోని డీఎంకే ప్రభుత్వాన్ని గద్దె దించే వరకూ పాద రక్షలు వాడబోనని శపథం చేశారు. అన్నామలై ప్రభుత్వ యూనివర్సిటీలో లైంగిక దాడి కేసులో ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్రతి శుక్రవారం తన ఇంటి ముందు ఆరు కొరడా దెబ్బలు తింటానని గురువారం మీడియాకు చెప్పారు. 
 
ఈ కేసులో బాధితురాలి పేరు, ఫోన్ నంబర్, వ్యక్తిగత వివరాలు వెల్లడించడం పట్ల మండి పడ్డారు. `ఎఫ్ఐఆర్ పబ్లిక్ డొమైన్ ఎలా అయింది? ఎఫ్ఐఆర్ లీక్ చేయడం ద్వారా బాధితురాలి గుర్తింపును బహిర్గతం చేశారు. ఇది బాధితురాలి పట్ల ప్రభుత్వం, పోలీసుల వైఖరిని తెలియజేస్తున్నది. ఎఫ్ఐఆర్ లీక్ చేసినందుకు పోలీసులు, డీఎంకే సిగ్గు పడాలి. నిర్భయ నిధి ఎక్కడ. అన్నా యూనివర్సిటీ క్యాంపస్‌లో ఎందుకు సీసీటీవీ కెమెరా లేదు’ అని అన్నామలై మండి పడ్డారు.
 
రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎస్ రేగుపతిపై అన్నామలై ధ్వజమెత్తారు. మూడు నెలలుగా రాష్ట్రం ప్రశాంతంగా ఉందని, లండన్ నుంచి అన్నామలై రాకతోనే రాష్ట్రంలో గందరగోళం నెలకొందని రాష్ట్ర మంత్రి రేగుపతి పేర్కొనడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి మకిలి రాజకీయాలకు చరమ గీతం పాడతామని తెలిపారు.
 
వచ్చే 48 రోజుల పాటు ఉపవాస దీక్ష చేపడతామని అన్నామలై వెల్లడించారు. ఫిబ్రవరి రెండో వారం నుంచి ఆరు అరుపడాయి వీడు (మురుగన్) ను దర్శించుకుంటా రాష్ట్రంలో పరిస్థితిపై మురుగన్‌కు ఫిర్యాదు చేస్తా అని తెలిపారు.