ప్రియాంక గాంధీ గెలుపుపై బిజెపి అభ్యర్థి దావా

ప్రియాంక గాంధీ గెలుపుపై బిజెపి అభ్యర్థి దావా
వయనాడ్ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ వాద్రా విజయాన్ని సవాల్ చేస్తూ బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ ప్రస్తుతం కేరళ హైకోర్టును ఆశ్రయించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రియాంక గాంధీ వాద్రా గెలుపును రద్దు చేయాలని ఆమె ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్‌ కోరారు. ఈ మేరకు నవ్య కేరళ హైకోర్టులో ఓ పిటిషన్‌ను దాఖలు చేశారు.
 వయనాడ్ ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ నామినేషన్ దాఖలు చేసిన సమయంలో ఎన్నికల అధికారులకు సమర్పించిన నామినేషన్ పత్రాల్లో తేడాలు ఉన్నాయని, అందులో ప్రియాంక గాంధీ కుటుంబ సభ్యుల ఆస్తులు చూపించలేదని నవ్య హరిదాస్ తన పిటిషన్‌లో ఆరోపించారు. 
 
అంతేకాకుండా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రియాంక గాంధీ ఉల్లంఘించారని, అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారని కేరళ హైకోర్టుకు తెలిపారు. అయితే ప్రస్తుతం కేరళ హైకోర్టుకు క్రిస్మస్ సెలవులు ఉండటంతో అవి పూర్తయిన తర్వాత కోర్టు విచారణ జరిపే అవకాశం ఉంది. డిసెంబర్ 23వ తేదీ నుంచి జనవరి 5వ తేదీ వరకు క్రిస్మస్ సెలవులు ఉన్నాయి. సెలవుల తర్వాతే నవ్య హరిదాస్ పిటిషన్‌పై కేరళ హైకోర్టు విచారణ జరపనుంది. 
 
ప్రియాంక గాంధీ నామపత్రాల్లో వ్యత్యాసాలు ఉన్నాయని, ఆస్తులు కూడా తప్పుగా ఉన్నాయని నవ్య హరిదాస్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను కూడా ఆమె ఉల్లంఘించారని ఆరోపించారు. వయనాడ్ ఓటర్లను కూడా ప్రియాంక గాంధీ తప్పుదారి పట్టించారని, అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారని నవ్య హరిదాస్ తీవ్ర ఆరోపణలు చేశారు. 
 
ఇటీవల వెలువడిన వయనాడ్ ఉపఎన్నిక ఫలితాల్లో ప్రియాంక గాంధీ విజయం సాధించడంతో ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి అరంగేట్రం చేసినట్లయింది. ప్రియాంక గాంధీకి మొత్తంగా 6,22,338 ఓట్లు రాగా, మూడో స్థానంలో నిలిచిన నవ్య హరిదాస్‌కు 1,09,939 ఓట్లు వచ్చాయి. దీంతో దాదాపు 5 లక్షలకు పైగా ఓట్ల తేడాతో నవ్య హరిదాస్ పరాజయం పాలయ్యారు. 
 
వయనాడ్ ఉపఎన్నికలో ప్రియాంక గాంధీ వాద్రా అక్రమాలకు పాల్పడి విజయం సాధించారని ఆమె విమర్శిస్తూ హైకోర్టులో సవాల్ చేశారు. ఇక 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వయనాడ్, రాయ్‌బరేలీ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి రెండు చోట్లా గెలుపొందారు. దీంతో వయనాడ్ ఎంపీ స్థానానికి రాజీనామా చేసి రాయ్‌బరేలీ ఎంపీగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే వయనాడ్‌ ఉపఎన్నికలు నిర్వహించగా.. అక్కడ ప్రియాంక గాంధీ భారీ విజయాన్ని అందుకున్నారు.