ఫార్ములా ఈ-రేసు కేసుపై రంగంలోకి దిగిన ఈడీ

ఫార్ములా ఈ-రేసు కేసుపై రంగంలోకి దిగిన ఈడీ
* హైకోర్టులో 30 వరకు అరెస్ట్ నుండి కేటీఆర్ కు ఊరట
 
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఫార్ములా ఈ-కారు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్ కూడా కేటీఆర్‌పై కేసు నమోదు చేసింది.
 
ఎసిబి కేసు నమోదు చేయగానే,  ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ కెటిఆర్ పై కేసు నమోద చేయగా.. తాజాగా ఈడీ కూడా కేసు నమోదు చేసింది.శుక్రవారం కెటిఆర్ పై నమోదైన కేసు వివరాలను తమకు అందజేయాలని హైదరాబాద్ ఇడి జాయింట్ డైరెక్టర్ రోహిత్ ఆనంద్, ఎసిబికి లేఖ రాశారు. ఎఫ్‌ఐఆర్ కాపీతో పాటుగా హెచ్‌ఎండిఎ సంస్థ అకౌంట్ నుంచి ఎంత మొత్తం నిధులను బదిలీ చేశారని పూర్తి వివరాలు కూడా కావాలని ఆయన పేర్కొన్నారు.ముఖ్యంగా ఈ నగదు బదిలీకి సంబంధించి ఏ ఏ తేదీలలో లావాదేవీలు  జరిగాయో పంపాలని ఆయన లేఖలో ప్రస్తావించారు. ఇక ఇదే సమయంలో మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్ ఫిర్యాదు కాపీని కూడా తమకు పంపాలని ఇడి జాయింట్ డైరెక్టర్ ఎసిబి డిజికి రాసిన లేఖలో పేర్కొన్నారు. తాజాగా ఈ కేసుపై వివరాలు అందుకున్న ఈడీ కెటిఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలపై కేసు నమోదు చేసింది.

మరోవంక, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌కు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఫార్ములా-ఈ కార్‌ రేస్‌ వ్యవహారంలో సంబంధించి అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) తనపై నమోదు చేసినటువంటి ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్‌ చేయాలని కేటీఆర్‌ దాఖలు చేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. ప్రాథమిక దర్యాప్తు ఇప్పటికే పూర్తయినందున మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి హైకోర్టులో వాదనలను వినిపించారు.
 
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సుందరం, ప్రభాకర్‌రావు, గండ్ర మోహన్‌రావు హైకోర్టులో వాదనలు వినిపించారు. అవినీతి నిరోధక చట్టం కింద పెట్టినటువంటి సెక్షన్లు ఈ కేసుకు వర్తించవని, ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్‌ చేయాలని హైకోర్టును కోరారు. 
 
ఈ వ్యవహారంలో కేటీఆర్ ఎక్కడా లబ్ధి పొందలేదని న్యాయస్థానానికి సుందరం తెలిపారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఏసీబీ కేసు నమోదు చేసిందని, ఏసీబీ నమోదు చేసిన సెక్షన్లు కేటీఆర్‌కు వర్తించవని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి అసలు ఆధారాలే లేవని చెప్పారు. కేటీఆర్ లబ్ధి చేకూరినట్లు ఎక్కడా నిరూపితం కాలేదని చెప్పారు.
ఇరు వైపులా వాదనలు విన్న ధర్మాసనం ఈనెల 30 వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయవద్దని ఆదేశించింది. కేటీఆర్‌పై అవినీతి నిరోధక శాఖ నమోదు చేసిన కేసులో దర్యాప్తు కొనసాగించవచ్చని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తదుపరి విచారణను ధర్మాసనం ఈనెల 27వ తేదీకి వాయిదా వేసింది.
 
ఫార్ములా-ఈ రేసు వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదైంది. నాటి పురపాలక శాఖ మంత్రిగా వ్యవహరించిన కేటీఆర్‌ను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆయనతో పాటు ఐఏఎస్‌ అధికారి అర్వింద్‌ కుమార్‌ ఏ2గా, హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డిలను ఏ3గా చేర్చింది. 
 
ఈ కేసు విచారణ కోసం ఈ ముగ్గురికి నోటీసులు జారీ చేసే అవకాశముంది. హెచ్‌ఎండీఏ, రాష్ట్ర ఆర్థికశాఖ, ఆర్బీఐ అనుమంతి లేకుండానే నేరుగా విదేశీ సంస్థకు రూ.55 కోట్ల చెల్లింపులు జరిగాయి. వీటిలోనూ రూ.46 కోట్ల వరకు డైరెక్ట్గా డాలర్ల రూపంలో చెల్లించడం ఉల్లంఘనే అనేది కేసులో ప్రధాన అభియోగం. విదేశీ సంస్థకు నగదు చెల్లింపులు ఎలా జరిగాయనే కోణంలో ఏసీబీ దర్యాప్తు చేయనుంది. తాజాగా ఈడీ కేసు వివరాలను కోరుతూ ఏసీబీకి లేఖ రాశారు.