జగన్ అక్రమాస్తుల కేసులపై సుప్రీంకు సిబిఐ, ఈడీ నివేదిక

జగన్ అక్రమాస్తుల కేసులపై సుప్రీంకు సిబిఐ, ఈడీ నివేదిక

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల బదిలీ, బెయిల్ రద్దు పిటిషన్లపై విచారణ మరోసారి సుప్రీంకోర్టులో వాయిదా పడింది. సిబిఐ, ఈడీ కేసుల స్టేటస్ వివరాలు గురువారం సాయంత్రం ఫైల్ చేసినట్లు సీబీఐ తరఫు న్యాయవాది ధర్మాసనానికి వెల్లడించారు. జగన్ కేసుల విచారణలో జాప్యంపై సీబీఐ, ఈడీ అధికారులు అఫిడవిట్ రూపంలో సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చారు. 

విచారణ జాప్యానికి కారణాలను దర్యాప్తు సంస్థలు అఫిడవిట్లో వివరించాయి. రిపోర్ట్ కాపీని పరిశీలిస్తామని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం వెల్లడించింది. స్టేటస్ రిపోర్టు పరిశీలనకు జగన్ తరఫు న్యాయవాదులు సమయం కోరారు. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ ఆలస్యమవుతోందంటూ వేగవంతంగా ట్రయల్ పూర్తి చేయాలని ఉపసభాపతి రఘురామకృష్ణరాజు గతంలో పిటిషన్ దాఖలు చేశారు. 

కేసులను తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు. అదేవిధంగా జగన్ బెయిల్ రద్దు చేయాలని లేకపోతే విచారణపై తీవ్ర ప్రభావం పడుతుందని మరో పిటిషన్ వేశారు. రఘురామ దాఖలు చేసిన రెండు పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. సీబీఐ, ఈడీ ఇచ్చిన నివేదికలు పరిశీలించాక తీర్పు ఇస్తామంటూ తదుపరి విచారణను జనవరి 10కి వాయిదా సుప్రీం ధర్మాసనం వాయిదా వేసింది.

జగన్ కేసుల విచారణలో ఎందుకు జాప్యం జరుగుతుందని దర్యాప్తు సంస్థలను గతంలోనే సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. కేసుల స్టేటస్ ను వివరిస్తూ నివేదిక ఇవ్వాలని ఈనెల 2న విచారణ సందర్భంగా దర్యాప్తు సంస్థలను ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో ట్రయల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు దాఖలైన పిటిషన్లు, పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలతో అఫిడవిట్ రూపంలో స్టేటస్ రిపోర్టును దర్యాప్తు సంస్థలు దాఖలు చేశాయి.

మొత్తం 120 మంది నిందితులపై ఛార్జిషీట్లు దాఖలయ్యాయి. ఇప్పటి వరకు 860 మంది సాక్షులను కోర్టు విచారించింది. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో మొత్తం 125 పిటిషన్ల విచారణ పెండింగ్ లో ఉన్నాయి. ట్రయల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు దాఖలైన పిటిషన్లలో దాదాపు 80 శాతం పిటిషన్లు పెండింగ్ లోనే ఉన్నట్లు దర్యాప్తు అఫిడవిట్ ద్వారా తెలుస్తోంది. 

ట్రయల్ కోర్టులో 11కేసుల్లో 86 డిశ్చార్జి పిటిషన్లు దాఖలు చేయగా అన్ని పెండింగ్ లో ఉన్నాయి. ఏ ఒక్క డిశ్చార్జి పిటిషన్ లోనూ తుది తీర్పు వెలువరించలేదు. సిబిఐ, ఈడీ ఇచ్చిన నివేదికలను పరిశీలించిన తర్వాతే తీర్పు ఇస్తామని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం వెల్లడించింది.