దేశ ఐక్యతకు రాజ్యాంగం ఓ రోడ్‌మ్యాప్‌‌

దేశ ఐక్యతకు రాజ్యాంగం ఓ రోడ్‌మ్యాప్‌‌
దేశాన్ని ఐక్యంగా, ప్రజాస్వామ్యంగా, స్వావలంబనగా ఉంచేందుకు రాజ్యాంగం ఓ రోడ్‌మ్యాప్‌గా ఉపయోగపడుతుందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. భారత రాజ్యాంగం ఏదో ఒక పార్టీకి చెందిన పత్రం కాదని, ప్రతి పౌరుడికి నైతిక దిక్సూచి అని, ప్రతి వ్యక్తికి బలమైన గుర్తింపును అందిస్తుందని పేర్కొన్నారు. అయితే, ప్రతిపక్షాలు అనేక సందర్భాల్లో రాజ్యాంగాన్ని అవమానించాయని మండిపడ్డారు.
 
భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా పార్లమెంట్‌లోని ఉభయ సభల్లో రెండు రోజుల పాటు ప్రత్యేక చర్చలో భాగంగా లోక్‌సభలో శుక్రవారం ఉదయం జీరో అవర్‌ ముగిసిన తర్వాత చర్చను  రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రారంభిస్తూ  రాజ్యాంగ నిర్మాణ పనిని హైజాక్ చేయడానికి ఒక నిర్దిష్ట పార్టీ ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉందని ఆరోపించారు. అయితే మన రాజ్యాంగం ఒకే పార్టీ బహుమతి కాదని అంటూ ఆయన స్పష్టం చేశారు.
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని ముఖ్యమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని అనేక కీలక పథకాలను అభివృద్ధి చేసినట్లు చెప్పారు.  సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక జీవితంలోని అన్ని అంశాలను స్పృశించడం ద్వారా మన రాజ్యాంగం జాతి నిర్మాణానికి మార్గం సుగమం చేస్తుందని ఆయన తెలిపారు. 
 
భారత రాజ్యాంగాన్ని భారత ప్రజలు భారతదేశ విలువలకు అనుగుణంగా రూపొందించారని చెబుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  నాయకత్వంలోని తమ ప్రభుత్వం సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్ స్ఫూర్తితో పనిచేస్తోందని చెప్పారు. తమ  ప్రభుత్వం భారత రాజ్యాంగంలో వ్రాయబడిన ధర్మానికి అనుగుణంగా పనిచేస్తోందని స్పష్టం చేశారు.
 
మన రాజ్యాంగం ప్రగతిశీలమైనది, అందరినీ కలుపుకొనిపోయేది, పరివర్తన కలిగించేదని పేర్కొంటూ భారత రాజ్యాంగంలో వ్రాయబడిన ‘ధర్మం’ ప్రకారం ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు. “అనేక వలసరాజ్యాల అనంతర ప్రజాస్వామ్యాలు, వాటి రాజ్యాంగాలు ఎక్కువ కాలం కొనసాగలేదు. కానీ భారత రాజ్యాంగం, అన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని దాని ప్రాథమిక స్ఫూర్తిని కోల్పోకుండా నిర్వహించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తూనే ఉంది” అని రక్షణ మంత్రి కొనియాడారు. 
 
నేడు రాజ్యాంగాన్ని రక్షించడం గురించి చర్చ జరుగుతోందని చెబుతూ ఇది మనందరి విధి అని తెలిపారు. కానీ రాజ్యాంగాన్ని ఎవరు గౌరవించారో, దానిని ఎవరు అగౌరవపరిచారో కూడా మనం అర్థం చేసుకోవాలని కోరారు.