
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్‌పై ప్రతిపక్ష పార్టీలు అభిశంసన తీర్మానాన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టాయి. ఇటీవల జరిగిన వీహెచ్పీ కార్యక్రమంలో ఆయన వివాదస్పద వ్యాఖ్యలు చేశారని రాజ్యసభ సెక్రటరీ జనరల్ కు నోటీసును అందించాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.
జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్పై అభిశంసన తీర్మానాన్ని ప్రతిపాదించడానికి సంబంధించిన నోటీసుపై కపిల్ సిబల్, దిగ్విజయ్ సింగ్, జాన్ బ్రిట్టాస్, మనోజ్ కుమార్ ఝా, చిదంబరం, రణ్ దీప్ సుర్జేవాలా, ప్రమోద్ తివారీ, జైరాం రమేశ్, ముకుల్ వాస్నిక్, నాసీర్ హుస్సేన్, రాఘవ్ చద్దా, సంజయ్ సింగ్, రేణుకా చౌదరి సహా 55 మంది ప్రతిపక్ష ఎంపీలు సంతకం చేశారు.
న్యాయమూర్తుల (విచారణ) చట్టం 1968, రాజ్యాంగంలోని ఆర్టికల్ 218 కింద ఈ తీర్మానానికి సంబంధించిన నోటీసును సమర్పించారు. విశ్వ హిందూ పరిషత్ నిర్వహించిన కార్యక్రమంలో జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని నోటీసులో విపక్ష సభ్యులు ఆరోపించారు. ద్వేషపూరిత ప్రసంగం, మత సామరస్యాన్ని దెబ్బతీసే చర్యలకు పాల్పడ్డారని పేర్కొన్నారు.
న్యాయమూర్తి మైనారిటీలను లక్ష్యంగా చేసుకున్నారని, వారిపై పక్షపాతం చూపించారని తెలిపారు. “జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించిన విషయాలపై రాజకీయంగా మాట్లాడారు. బహిరంగంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇలా చేయడం న్యాయవ్యవస్థను ఉల్లంఘించినట్లే. జస్టిస్ శేఖర్ కుమార్ చేసిన బహిరంగ వ్యాఖ్యలు రెచ్చగొట్టేవిగా ఉన్నాయి. అలాగే పక్షపాతంతో కూడుకున్నవి” అని నోటీసులో పేర్కొన్నారు.
“దేశంలోని మెజారిటీ ప్రజల ఇష్టానికి అనుగుణంగా భారత్ పనిచేస్తుందని జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ అన్నారు. ఆయన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51ఏ(ఈ) కింద పొందుపరచిన ఆదేశిక సూత్రాలను ఉల్లంఘించారు. ఆయన వ్యాఖ్యలు వివిధ మతాలు, మత సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహిస్తున్నాయి. రాజ్యాంగంలోని లౌకిక నీతిని ఉల్లంఘిస్తున్నాయి” అని తెలిపారు.
“1968 న్యాయమూర్తుల (విచారణ) చట్టం ప్రకారం భారత రాష్ట్రపతికి ఈ నోటీసును పంపాలి. ద్వేషపూరిత ప్రసంగం, న్యాయ ఉల్లంఘనల ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని రాజ్యసభ ఛైర్మన్ ను అభ్యర్థిస్తున్నాం. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి పదవి నుంచి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ కు తొలగించాలి. ” అని అభిశంసన నోటీసులో విపక్ష సభ్యులు పేర్కొన్నారు.
డిసెంబర్ 8న జరిగిన వీహెచ్పీ కార్యక్రమంలో జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి పౌరస్మృతి ప్రధాన లక్ష్యం సామాజిక సామరస్యం, లింగ సమానత్వం, లౌకికవాదాన్ని ప్రోత్సహించడమేనని తెలిపారు. అలాగే మెజారిటీ ప్రజల అభీష్టం మేరకే చట్టం నడుచుకోవాలని వ్యాఖ్యానించారు. దీంతో ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని హైకోర్టును సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది.
More Stories
తెలంగాణలోని ఎనిమీ ప్రాపర్టీస్ పై మర్చిలోగా లెక్క తేల్చాలి
భారత్ కు అమెరికా ఎఫ్-25 ఫైటర్ జెట్ లు .. చైనా, పాక్ కలవరం
రేవంత్ కట్టడి కోసమే తెలంగాణకు మీనాక్షి నటరాజన్!