పూర్వ క్షేత్ర సంఘచాలక్ జస్టిస్ పర్వతరావు కన్నుమూత

పూర్వ క్షేత్ర సంఘచాలక్ జస్టిస్ పర్వతరావు కన్నుమూత
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) దక్షిణ మధ్య క్షేత్ర పూర్వ సంఘచాలకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుంకవల్లి పర్వత రావు  (89) వృద్ధాప్య సంబంధ అనారోగ్య కారణాలతో బుధవారం ఉదయం 11.30 గంటలకు భాగ్యనగరంలోని తమ నివాసంలో స్వర్గస్తులయ్యారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు.
 
బాల్యం నుంచీ ఉత్తమ విద్యార్థిగా, విలువల మధ్య పెరిగిన పర్వతరావు 1935లో ఆంధ్రప్రదేశ్‌లోని ఉంగుటూరులో జన్మించారు. విజయవాడలో పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య పూర్తయిన తరువాత మద్రాసు లయోలా కళాశాల నుంచి వ్యవసాయంలో బీఎస్సీ డిగ్రీ అందుకున్నారు. అనంతరం 1954లో ఇంగ్లాండ్‌లోని ఆక్సుఫర్డు యూనివర్శీటిలో పిజిక్స్, ఫిలాసఫి, పాలిటిక్స్, ఎకనామిక్స్‌ను సెంట్ కేటర్నీస్ సోసైటీలో పూర్తి చేసుకుని స్వదేశమునకు తిరిగి వచ్చారు. 
 
తర్వాత 1958-60 మధ్య మద్రాసులో న్యాయ విద్యను అభ్యసించి, హైదరాబాదులోని దువ్వూరి నరసరాజు వద్ద సహాయకులుగా వృత్తిలో నైపుణ్యం సాధించి 1961 నుంచీ అడ్వకేట్‌గా వృత్తి ప్రారంభించారు. ఆయన న్యాయవాదవృత్తితో పాటుగా కంపెనీల వ్యవహారాలలో నైపుణ్యం సాధించి ఆ రంగములోని సైతం మంచి ప్రతిభను కనబరిచారు. 
 
తన వృతి మాత్రమే కాకుండా వైద్యము, ఇంజనీరింగ్ ఇతర విషయాలపై కూడా అనేక పుస్తకములను చదువుతూ ఇతర అంశాలలోనూ మంచి అధ్యయనంతో అవగాహనను కలిగి ఉండేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. జడ్జిగా పదవీ విరమణ చేసిన తర్వాత వీరిని రాష్ట్ర ప్రభుత్వము స్టేట్ కన్స్యుమర్ ఫోరమ్ చైర్మన్‌గా నీయమిచ్చింది. జిల్లాస్థాయిలో సరైన సౌకర్యాలు కల్పించామని తనకు చేసిన సూచనకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించక పోవడంతో ఐదేళ్ల పదవీకాలం ఉన్నప్పటికీ రెండేళ్లకే రాజీనామా చేశారు.
 
దేశంలో ఎమర్జెన్సీ తరువాత జరిగిన జన జాగరణలో పర్వతరావు సంఘ్ సంపర్కంలోకి వచ్చారు. తరువాత జరిగిన ప్రాథమిక శిక్షావర్గలో వర్గ అధికారిగా వున్నారు. నగర సంఘచాలక్‌గా, భాగ్ సంఘచాలక్‌గా, భాగ్యనగర్ విభాగ్ సంఘచాలక్‌గా వివిధ బాధ్యతలు నిర్వహించారు. హైకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన తరువాత 2000 సంవత్సరం నుండి 2012 వరకూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలతో ఉన్న దక్షిణ మధ్య క్షేత్ర సంఘచాలక్‌గా బాధ్యతలు నిర్వహించారు.
 
పర్వతరావు మృతి పట్ల ఆర్ఎస్ఎస్ సర్‌కార్యవాహ దత్తాత్రేయ హొసబలె సంతాపం ప్రకటించారు. “శ్రీ పర్వతరావు అంకితభావం కలిగిన అత్యంత జ్ఞానమూర్తి అయిన కార్యకర్తగా ప్రతి ఒక్కరికీ మార్గదర్శకంగా నిలిచారు. వారి జీవనయాత్ర ముగిసింది. ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తిగా ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు. భగవంతుడు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నాను. ఆయన స్మృతికి నివాళులు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఓం శాంతిః॥” అని సంతాప సందేశంలో తెలిపారు.
 
సామాజిక సేవలలో సైతం తనదైన ముద్ర వేసుకున్న పర్వతరావు, తమ స్వస్థలమైన ఉంగుటూరులో సుమారు 45 ఏళ్ల కిందట 48 సెంట్ల భూమిని డాక్టర్ సుంకవల్లి విజ్ఞాన భారతి పాఠశాల కోసం అందజేశారు. పాఠశాల నిర్మాణం కోసం రూ.10 లక్షలు స్వంత నిధులు ఇవ్వడమేగాక తన దగ్గర పనిచేసిన లాయర్స్, రిటైర్డ్ జడ్జీల నుండి కోటి రూపాయలు, బీవీకే నుంచి రూ. 20 లక్షలు సేకరించి పాఠశాల భవనాన్ని నిర్మింపచేసినారు. పాఠశాలను నిర్మించి బివికే వైజాగ్ సంస్థకి అప్పగించారు. 
 
తమ వ్యవసాయ క్షేత్రంలోని 35 ఎకరాలను గౌతమి సేవా సంస్థకు అప్పగించారు. మరో 5 ఎకరాలు గోపాలకృష్ణ గోశాలకు వితరణ చేసి గోశాల నెలకోల్పటానికి ప్రధాన కారకులయ్యారు. వారికి మిగిలిన 280 గజముల స్థలములో ఉంగుటూరు హైవే ప్రక్కన స్థలములో ఆర్గానిక్ గో ఉత్పత్తుల అమ్మకానికి రూ. 16 లక్షలతో భవనాన్ని నిర్మించి ఇచ్చారు.