తెలుగు రాష్ట్రాల్లో కొండెక్కిన గుడ్ల ధర

తెలుగు రాష్ట్రాల్లో కొండెక్కిన గుడ్ల ధర

తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల వినియోగం భారీగా పెరగడంతో గుడ్డు ధర కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా పెరిగింది. ఇప్పుడు ఏకంగా 7 రూపాయలకు చేరింది. వేసవిలో ఎండ తీవ్రతతో ధరలు తగ్గిన తర్వాత ఎండలు తగ్గి వర్షాలు పడటంతో రోజూవారీ ఉత్పత్తి క్రమేణా రేటు పెరుగుతుంది. ఈశాన్య రాష్ట్రాలతో పాటు స్థానికంగా గుడ్డు వినియోగం పెరిగింది.

ప్రస్తుతం హోల్‌సేల్‌లో కోడిగుడ్డు ధర ఒక్కొక్కటి రూ.6.20 పలుకుతోంది. అదే మార్కెట్‌లో వినియోగదారుడికి అయితే రూ.7లకు అమ్ముతున్నారు. ఈ రేట్లు గతంలో ఎప్పుడూ నమోదు కాలేదని పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. సాధారణంగా చలికాలంలో కోడిగుడ్ల ధరలు పెరుగుతాయి. కానీ ఈ స్థాయిలో పెరగడం అరుదని వ్యాపారులు చెబుతున్నారు. 

డిసెంబర్ నెలలో క్రిస్‌మస్, ఆ తర్వాత న్యూఇయర్ వేడుకలు జరగనున్నాయి. దీంతో కేక్‌లకు బాగా డిమాండ్ ఉంటుంది. కేక్‌లలో గుడ్డు వినియోగం ఎక్కువగా ఉంటుంది. అందుకే రేట్లు పెరుగుతాయని పౌల్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు. ఆగస్టు నెలలో కోడి గుడ్డు ధర 5.70 రూపాయలు ఉండగా సెప్టెంబర్ మాసంలో 6.24 రూపాయలకు చేరింది.

అలాగే అక్టోబర్ నెలలో 6.28 రూపాయలు ఉండగా నవంబర్ మాసంలో 6.50 రూపాయలు ఉంది. తాజాగా డిసెంబర్ నెలలో 7 రూపాయలకు చేరింది. చికెన్ ధరలు కూడా ఈ నెలలో పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం కేజీ చికెన్ రూ.200 నుంచి రూ.240 వరకు ఉంది. క్రిస్‌మస్, న్యూఇయర్, సంక్రాంతి వరకు చికెన్ ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు.

గత వేసవిలో ఎండ కారణంగా 20 శాతం వరకు ఉత్పత్తి పడిపోగా రోజుకు సగటున లక్ష కోళ్లు చనిపోయాయి. పౌల్ట్రీ పరిశ్రమకు సుమారు రూ.50 కోట్ల మేర నష్టం జరిగింది. కోళ్ల మేతకు మొక్కజొన్న టన్ను రూ.22 వేల నుంచి రూ.24 వేలు వరకు పలుకుతుంది. అలాగే నూకలు రూ.18 వేల నుంచి రూ.22 వేల చొప్పున పెరిగాయి. 

కోళ్ల మేతల ధర టన్ను రూ.26 వేల వరకు పెరగడం రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. పెరిగిన నిర్వహణ ఖర్చుతో ప్రస్తుతం గుడ్డు ఉత్పత్తి ఖర్చు రూ.5 గా ఉందని కోళ్ల రైతులు తెలిపారు. దేశంలోనే అత్యధిక కోడిగుడ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ ఉన్నాయి.

దేశంలోనే నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ప్రతి రోజు 32 కోట్ల కోడిగుడ్లు ఉత్పత్తి చేస్తే దక్షిణాదిలోని తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు ప్రతి రోజు 15 కోట్ల కోడిగుడ్లను ఉత్పత్తి చేస్తున్నాయి. రోజుకు 5 వేల కోడిగుడ్ల ఉత్పత్తితో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ తొలి, రెండో స్థానాల్లో ఉన్నాయని పౌల్ట్రీ అసోసియేషన్ నేతలు వెల్లడించారు.

కాగా కార్తీకమాసానికి ముందు కిలో కోడి మాంసం ధర రూ. 230 నుంచి 240 వరకు ఉండగా ప్రస్తుతం స్కిన్‌లెస్ రూ.180 నుంచి 190 పలుకుతోంది. ముందు క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు ఉండటంతో దీని ధర మళ్లీ పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కరోనా తరువాత పౌల్ట్రీ రైతులు ఇప్పటికీ కోలుకోలేదని, ప్రస్తుతం ఉన్న కోడి గుడ్డు ధర రేట్లు పెరిగినా రైతుకు లాభాలు వచ్చేది మాత్రం తక్కువేనని, ఈ ధర ఇలాగే ఐదు నెలల ఉంటే రైతులకు కొంత మేర ఉపశమనం కలుగుతుందని పౌల్ట్రీ రైతులు భావిస్తున్నారు.