ఎస్ఎం కృష్ణ మృతిపట్ల ప్రధాని, చంద్రబాబు సంతాపం

ఎస్ఎం కృష్ణ మృతిపట్ల ప్రధాని, చంద్రబాబు సంతాపం

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఎస్ఎం కృష్ణ మృతిపట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  సంతాపం తెలిపారు. ఆయన అసాధారణ నేత. తన జీవితాంతం ఇతరుల కోసం పాటుపడ్డారు. కర్ణాటక సీఎంగా ఆయన అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయి. ప్రత్యేకంగా మౌలిక సదుపాయాల కల్పనపై ఆయన ఎక్కువ శ్రద్ద చూపేవారు. ఎస్ఎం కృష్ణలో గొప్ప పాఠకుడు, ఆలోచనాపరుడు ఉన్నారని ప్రధాని మోదీ  కొనియాడారు.

మరోవైపు ఎస్ఎం కృష్ణ మృతిపట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎస్ఎం కృష్ణ మరణ వార్త బాధించిందని తెలిపారు. పెట్టుబడులను ఆకర్షించే క్రమంలో స్నేహపూర్వకంగా పోటీపడేవాళ్లం అని కృష్ణతో గత అనుభవాలను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ప్రజల సంక్షేమానికి ఎప్పుడూ ప్రాధాన్యతనిచ్చే నిజమైన నాయకుడు ఎస్ఎం కృష్ణ. కష్ట సమయంలో ఆయన కటుంబ సభ్యులు, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

 కృష్ణ మృతి పట్ల కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలో మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది. డిసెంబర్‌ 10 నుంచి డిసెంబర్‌ 12 వరకూ ఎలాంటి కార్యక్రమాలు, వేడుకలు నిర్వహించడం లేదని తెలిపింది. ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. 

దీంతో ప్రస్తుతం బెళగావిలో నిర్వహిస్తున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాలను గురువారానికి వాయిదా వేశారు. మరోవైపు ఎస్‌ఎం కృష్ణ భౌతికకాయానికి పలువురు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురయ్యారు.