కర్ణాటక మాజీ సీఎం ఎస్‌ఎం కృష్ణ కన్నుమూత

కర్ణాటక మాజీ సీఎం ఎస్‌ఎం కృష్ణ కన్నుమూత
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి ఎస్‌ఎం కృష్ణ కన్నుమూశారు. గతకొంత కాలంగా వృద్ధాప్యం రీత్యా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తెల్లవారుజామున బెంగళూరు సదాశివనగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.  92 ఏళ్ల కృష్ణకు భార్య ప్రేమ కృష్ణ, కుమార్తెలు శాంభవి- మాళవిక ఉన్నారు. ఎస్​ఎం కృష్ణ పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత.

ఆరున్నర దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉన్న ఎస్ఎం కృష్ణ వయసు సంబంధిత సమస్యలతో 2023 జనవరి 7న రాజకీయాలకు వీడ్కోలు పలికారు. కొద్దికాలం క్రితం ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌ కారణంగా బెంగళూరులోని మణిపాల్ హాస్పిటల్‌లో దవాఖానలో చేరారు. నాలుగు నెలలపాటు చికిత్స అనంతరం కోలుకున్న ఆయన ఆగస్టు 28న డిశ్చార్జ్‌ అయ్యారు.

అయితే ఆయనను ఆ తర్వాత కూడా అనారోగ్య సమస్యలు వెంటాడటంతో మంగళవారం తెల్లవారుజామను కన్నుమూశారు. ఎస్ఎం కృష్ణ పార్థివదేహానికి, ఆయన స్వగ్రామం మద్దూరులోని సోమనహళ్లిలో బుధవారం అంత్యక్రియలు జరగనున్నాయి.

పాత మైసూరు ప్రాంతంలోని మద్దూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన ఎస్‌ఎం కృష్ణ 1999 నుంచి 2004 వరకు కర్ణాటక 16వ ముఖ్యమంత్రిగా పనిచేశారు. తర్వాత 2004 నుంచి 2008 వరకు మహారాష్ట్ర గవర్నర్‌గా, కేంద్ర విదేశాంగ మంత్రిగా పనిచేశారు. 1971 నుంచి 2014 వరకు వివిధ సమయాల్లో లోక్‌సభ, రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. 

1989 డిసెంబర్ నుంచి జనవరి 1993 వరకు అసెంబ్లీ స్పీకర్‌గా కూడా వ్యవహరించారు. చాలా కాలంపాటు కాంగ్రెస్‌లో కొనసాగిన ఎస్ఎం కృష్ణ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో 2017 మార్చిలో బీజేపీలో చేరారు. ఆయన చివరిసారిగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేశారు. ఆ తర్వాత ఎస్ఎం కృష్ణ క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు.

మైసూర్‌లోని మహారాజా కళాశాలలో పట్టభద్రుడయ్యారు. అనంతరం బెంగళూరులోని ప్రభుత్వ న్యాయ కళాశాలలో లా చేశారు. తరువాత, అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని సదరన్ మెథడిస్ట్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యనభ్యసించారు. వాషింగ్టన్‌లోని జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఫుల్‌బ్రైట్ స్కాలర్‌షిప్‌ను అందుకున్నారు.