వైఎస్సార్సీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆర్.కృష్ణయ్య తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సెప్టెంబర్ 23వ తేదీన రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్కు ఆర్. కృష్ణయ్య అందజేశారు. కృష్ణయ్య రాజీనామాను ఆమోదిస్తున్నట్టు సెప్టెంబర్ 24వ తేదీన ప్రకటించారు. పదవీ కాలం 4 సంవత్సరాలు ఉండగానే కృష్ణయ్య రాజీనామా చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు కొన్ని అడ్డంకులు ఉన్నాయని, అందువలనే తన పదవికి రాజీనామా చేసినట్టు ఆ సమయంలో ఆర్.కృష్ణయ్య పేర్కొనడం గమనార్హం. తాజాగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్.కృష్ణయ్యకు బీజేపీ అవకాశం కల్పించింది. 2014లో ఎల్ బి నగర్ నుండి టిడిపి అభ్యర్థిగా పోటీ చేయడం ద్వారా ఆర్ కృష్ణయ్య తన ఎన్నికల రాజకీయాలు ప్రారంభించారు.
ఆయనను టిడిపి తెలంగాణకు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన ఆ సమయంలో శాసనసభకు ఎన్నికయ్యారు. రెండేళ్ల క్రితం ఏపీ నుండి వైసిపి అభ్యర్థిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. అయితే, టిడిపి, వైసీపీలకు చట్టసభలలో ప్రాతినిధ్యం వహిస్తున్న సమయంలో ఆయా పార్టీలలో ఆయన క్రియాశీలంగా వ్యవహరింపలేదు. ఆయా పార్టీల అభివృద్ధికి రాజకీయంగా ఎటువంటి మద్దతు ఇచ్చిన దాఖలాలు లేవు.
ఏపీలో ఖాళీగా ఉన్న మరో రెండు సీట్లపై సస్పెన్స్ కొనసాగుతోంది. టీడీపీ, జనసేన త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. వైఎస్సార్సీపీలో జరుగుతున్న వ్యవహారాలు నచ్చక రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన ఆ పార్టీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావులు తరువాత టీడీపీలో చేరారు. దీంతో వారికే అవకాశం ఇస్తారా, లేదంటే మరొకరిని నామినేట్ చేస్తారా అనేది త్వరలోనే తెలిసిపోనుంది.

More Stories
శ్రీవారి సేవలో పట్టుకు బదులు పాలిస్టర్ శాలువాలు
2 నెలల పాటు పర్వదినాల్లో టిటిడి వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
ఏపీలో ‘అటల్ సందేశ్ – మోదీ సుపరిపాలన’ యాత్ర