చిన్మయ్‌ కృష్ణదాస్‌పై బంగ్లాదేశ్‌లో మరో కేసు

చిన్మయ్‌ కృష్ణదాస్‌పై బంగ్లాదేశ్‌లో మరో కేసు
ఇస్కాన్‌ ప్రచారకర్త, ప్రముఖ హిందూ నాయకుడు చిన్మయ్‌ కృష్ణదాస్‌పై  బంగ్లాదేశ్‌లో మరో కేసు నమోదయింది. ఆయనతోపాటు వందలాది మంది అనుచరులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇప్పటికే దేశ ద్రోహం ఆరోపణలపై కృష్ణదాస్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
 
తాజాగా హెఫాజాత్-ఎ-ఇస్లాం కార్యకర్త ఇనాముల్ హక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైనట్లు బంగ్లా మీడియా వర్గాలు వెల్లడించాయి. గత నెల 26న చిట్టగాంగ్‌ కోర్టు ప్రాంగణంలో సంప్రదాయ దుస్తులు ధరించినందుకు చిన్మయ్‌ కృష్ణదాస్‌, ఆయన అనుచరులు తనపై దాడి చేశారని ఇనాముల్‌ హక్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

దీంతో తన కుడి చేయి విరిగిందని, తలకు తీవ్రమైన గాయాలయ్యాయని తెలిపాడు. దాడిలో తీవ్ర గాయాలపాలవడంతో నాటి నుంచి చికిత్స పొందుతున్నాని, తాజాగా డిశ్చార్జ్‌ కావడంతో నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశాడని ఆ కథనాలు వెల్లడించాయి. కృష్ణదాస్‌ను ప్రధాన నిందితుడిగా పేర్కొన్నాడని, 164 మంది గుర్తించబడిన వ్యక్తులు, మరో 500 మంది వరకు గుర్తుతెలియని వ్యక్తులను నిందితులుగా పేర్కొన్నట్లు తెలిపాయి.

దేశద్రోహం ఆరోపణలపై చిన్మయ్‌ కృష్ణ దాస్‌ బ్రహ్మచారిని బంగ్లాదేశ్‌ పోలీసులు గత నెల 26న అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. ఆయన అరెస్ట్‌ను నిరసిస్తూ వేలాది మంది హిందువులు ఆందోళనకు దిగారు. నిరసన తెలుపుతున్న హిందువులపై పోలీసులు కాల్పులు జరపడం ఉద్రిక్తతకు దారి తీసింది. 

 
హిందూ సంస్థ సమ్మిళిత సనాతన నేత అయిన బ్రహ్మచారిని హజ్రత్‌ విమానాశ్రయ సమీపంలో అరెస్ట్‌ చేసి, అనంతరం చిట్టగాంగ్‌కు తీసుకువచ్చారు. అక్టోబర్‌ 25న బ్రహ్మచారి ఒక ర్యాలీ సందర్భంగా జాతీయ జెండాను అవమానపర్చారంటూ మాజీ ప్రధాని, బంగ్లాదేశ్‌ నేషనల్‌ పార్టీ నేత ఖలీదా జియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై దేశద్రోహం కేసు నమోదైంది.