8.5 లక్షల కోట్లతో ప్రైవేటు అంతరిక్ష కేంద్రం

8.5 లక్షల కోట్లతో ప్రైవేటు అంతరిక్ష కేంద్రం
అంతరిక్ష వాణిజ్యంలో అపర కుబేరుల హవా నడుస్తోంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని కక్ష్య నుంచి సురక్షితంగా తొలగించే కాంట్రాక్టును ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌ సంస్థ దక్కించుకోగా, కొత్త అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసే బాధ్యతను అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్‌ సంస్థ తీసుకుంది.
 
ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌) కాలపరిమితి ముగుస్తున్నది. 2031 నాటికి ఐఎస్‌ఎస్‌ కార్యకలాపాలు ముగుస్తాయి. ఈ నేపథ్యంలో కొత్త అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసే బాధ్యతను బ్లూ ఆరిజిన్‌ సంస్థకు నాసా అప్పగించింది. ఆర్బిటల్‌ రీఫ్‌ పేరుతో అభివృద్ధి చేస్తున్న ఈ కొత్త అంతరిక్ష కేంద్రం 8,200 క్యూబిక్‌ అడుగుల స్థలంలో ఉంటుంది.
 
ఇది మొట్టమొదటి ప్రైవేటు అంతరిక్ష కేంద్రంగా నిలవనుంది. 2027లో దీనిని ప్రయోగించాలని, 2030 నుంచి పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించాలని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు ఏకంగా రూ.8.5 లక్షల కోట్లను బ్లూ ఆరిజిన్‌ సంస్థ ఖర్చు చేయనున్నది. సయెర్రా స్పేస్‌, అమెజాన్‌, బోయింగ్‌ వంటి సంస్థలతో కలిసి ఈ సంస్థ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మిస్తున్నది. 
 
ఇప్పటివరకు ఉన్న అంతరిక్ష కేంద్రాలు కేవలం వ్యోమగాముల కోసం మాత్రమే వినియోగించారు. ఈ కొత్త కేంద్రాన్ని మాత్రం భవిష్యత్తులో అంతరిక్ష పర్యాటకులకు విడిదిగానూ వినియోగించేలా నిర్మిస్తున్నారు. మొదట 10 మందికి సరిపోయే స్థలంలో దీనిని నిర్మిస్తున్నారు. ఆ తర్వాత మరింత విస్తరించనున్నారు. 
 
భూ దిగువ కక్ష్యలో ప్రవేశపెట్టే ఈ స్పేస్‌ స్టేషన్‌కు భారీ కిటికీలు ఉంటాయని, అక్కడి నుంచి భూమిని వీక్షించవచ్చని బ్లూ ఆరిజిన్‌ సంస్థ తెలిపింది. వ్యక్తిగత, వ్యాపార వినియోగానికి వీలుగా ప్రత్యేక క్వార్టర్లను ఏర్పాటు చేస్తున్నామని, సురక్షితమైన, ఉత్తేజభరితంగా ఉండేలా సౌకర్యాలు కల్పిస్తున్నామని వెల్లడించింది.