వరుసగా 11వ సారి వడ్డీ రేట్లు యథాతథం

వరుసగా 11వ సారి వడ్డీ రేట్లు యథాతథం
ఆర్థిక వృద్ధి- వినియోగదారులపై ద్రవ్యోల్బణం ప్రభావాన్ని ఎత్తిచూపుతూ.. రెపో రేటు, విధాన వైఖరిపై యథాతథ స్థితిని పాటిస్తున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్​బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. వరుసగా 11వసారి రెపో రేటును 6.50 శాతంగానే కొనసాగించాలని సెంట్రల్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) 4:2 మెజారిటీతో నిర్ణయించింది.

మూడు రోజుల పాటు జరిగిన ఈ సమావేశం డిసెంబర్ 4న ప్రారంభమై నేటితో ముగిసింది. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆర్​బీఐ గవర్నర్ రెపో రేటును యథాతథంగా ఉంచుతున్నట్టు వెల్లడించారు. వరుసగా 11 సమావేశంలో బెంచ్ మార్క్ రెపో రేటును 6.5 శాతం వద్ద యథాతథంగా ఉంచింది ఆర్​బీఐ. ద్రవ్య విధాన వైఖరిని ‘తటస్థంగా’ ఉంచింది.

ద్రవ్యోల్భణం పెరగడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణమని ఆర్​బీఐ గవర్నర్ దాస్ పేర్కొన్నారు. అక్టోబర్​ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.21 శాతానికి పెరిగిందని, ఇది ఒక సంవత్సరంలో మొదటిసారి సెంట్రల్ బ్యాంక్ టాలరెన్స్ బ్యాండ్​ని అధిగమించింది. ఇదిలావుండగా, జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 5.4 శాతానికి పడిపోయింది. 

ఇది ఏడు త్రైమాసికాల్లో బలహీనమైన వేగాన్ని సూచిస్తుంది. ఈ నేపథ్యంలో వడ్డీ రేట్ల కోత ఉంటుందా? అన్న ఊహాగానాలు మొదలయ్యాయి. కానీ ఈసారి ఆర్​బీఐ రెపో రేట్లను కట్​ చేయలేదు. ఇక ఫిబ్రవరిలో జరిగే సమావేశంలోనైనా వడ్డీ రేట్ల కోత ఉంటుందన్న అంచనాలు మొదలయ్యాయి.

ఆర్​బీఐ 2025 ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి అంచనాలను గతంలో అంచనా వేసిన 7.2 శాతం నుంచి 6.6 శాతానికి సవరించింది. క్యూ3ఎఫ్​వై25 జిడిపి వృద్ధి అంచనాను 7.4 శాతం నుంచి 6.8 శాతానికి, క్యూ4ఎఫ్​వై25 జీడీపీ వృద్ధి అంచనాను 7.4 శాతం నుంచి 7.2 శాతానికి, క్యూ1ఎఫ్​వై26 జీడీపీ వృద్ధి అంచనాను 7.3 శాతం నుంచి 6.9 శాతానికి కుదించింది.

2026 క్యూ26లో జీడీపీ వృద్ధి రేటు 7.3 శాతంగా ఉండొచ్చని ఆర్​బీఐ అంచనా వేసింది. క్యాష్​ రిజర్వ్​ రేషియో (సీఆర్​ఆర్​)ని 50 బేసిస్​ పాయింట్లు కట్​ చేసి 4శాతానికి తీసుకొచ్చింది ఆర్​బీఐ. ఇది లిక్విడిటీ పరిమితులను సులభతం చేయనుంది. ఎఫ్​సీఎన్​ఆర్ -బి డిపాజిట్లపై వడ్డీ రేటు పరిమితులను పెంచాలని ఆర్​బిఐ నిర్ణయించిందని గవర్నర్ దాస్ తెలిపారు. విదేశీ పెట్టుబడులకు భారత్​ను మరింత ఆకర్షణీయ గమ్యస్థానంగా మార్చడమే ఈ చర్య లక్ష్యమని స్పష్టం చేశారు.