ఐఐటి, ఐఐఎం అధ్యాపకులతో 80 శాతంకు పైగా జనరల్‌ కేటగిరీ

ఐఐటి, ఐఐఎం అధ్యాపకులతో 80 శాతంకు పైగా జనరల్‌ కేటగిరీ
 
దేశంలో ప్రతిష్టాకరమైన ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటి), ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)లలో బోధించే అధ్యాపకుల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు చాలా తక్కువ శాతం మందే ఉన్నారు. దాదాపు వీటిల్లో 80 శాతానికి పైగా జనరల్‌ కేటగిరీ 80కి చెందిన వారే బోధిస్తున్నారని ఆర్‌టిఐ (సమాచార హక్కు) ద్వారా లభించిన సమాచారం తెలియజేస్తోంది. 
 
కనీసం రెండు ఐఐటిలు, మూడు ఐఐఎంలో జనరల్‌ వాటా 90 శాతానికి మించిపోయింది. మరో ఆరు ఐఐటిల్లో, నాలుగు ఐఐఎంల్లో జనరల్‌ వాటా 80-90 శాతంగా ఉందని సమాచార హక్కు తెలియజేస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌ నెల లోపు ఐఐటి, ఐఐఎంల సంస్థల నుంచి తీసుకున్న సమాచారం మేరకు జనరల్‌ వాటా పెరిగిపోయిందని దీన్నిబట్టే తెలుస్తోంది.
 
కాగా, ఐఐటి, ఐఐఎంలతోపాటు ఇతర విద్యా సంస్థల్లో అధ్యాపకల పోస్టుల కోసం కేంద్రం రిజర్వేషన్లను కల్పించింది. ఓబిసిలకు 27 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్‌టిలకు 7.5 శాతం కేంద్రం రిజర్వేషన్లు కల్పించింది. అయితే వెనుకబడిన తరగతుల వారికి కేంద్రం అవకాశాలు కల్పించినా ఆచరణలో అవి అమలు కావడం లేదు. 
 
ఇండోర్‌ ఐఐఎంలో 109 పోస్టుల్లో 106 పోస్టులు జనరల్‌ కేటగిరీలోనే నడుస్తున్నాయి. ఈ ఐఐఎంలో ఎస్సీ, ఎస్టీలకు చెందిన అధ్యాపకులు లేరని ఆర్‌టిఐ తెలిపింది. ఇక ఉదరుపూర్‌లో 90 శాతానికి పైగానే జనరల్‌ కేటగిరీ, ఐఐఎం లక్నోలో కూడా 95 శాతానికి పైగా జనరల్‌ కేటగిరీకి చెందినవారే అధ్యాపకులుగా ఉన్నారు. ఆరు ఐఐఎంలలో ఒక్క ఎస్టీ కేటగిరికి చెందిన అధ్యాపకులు లేరు. 
 
కాగా, బెంగళూరు ఐఐఎంలో 85 శాతానికిపైగా జనరల్‌ కేటగిరీ అధ్యాపకులు ఉన్నారు. అందుకే రిజర్వేషన్లకు తగ్గట్టుగా అధ్యాపకుల్ని నియమించాలని అక్కడ నిరసనలు జరిగాయి. ఐఐటి ముంబయి, ఐఐటి ఖర్గ్‌పూర్‌లలో 700కి పైగా అధ్యాపక పోస్టుల్లో 90 శాతం జనరల్‌ కేటగిరిగికి చెందిన వ్యక్తులే ఉన్నారు. మండీ, గాంధీనగర్‌, కాన్పూర్‌, గౌహతి, ఢిల్లీ ఐఐటిల్లో 80-90 శాతం జనరల్‌ కేటగిరీ వారే అధ్యాపకులుగా ఉన్నారు. 
 
మొత్తంగా 13 ఐఐఎంల్లో 82.8 శాతం మంది జనరల్‌ కేటగిరీ, కేవలం 5 శాతం ఎస్సీ, ఒక శాతం ఎస్టీ, 9.6 శాతం ఓసిబి కేటగిరీలకు చెందిన వారు, ఆర్థికంగా బలహీనపడిన వర్గాల (ఇబిసి) నుండి, వికలాంగుల కోటా నుండి అధ్యాపకులుగా ఉన్నారు. 21 ఐఐటిల్లో 80 శాతం జనరల్‌ కేటగిరీ, 6 శాతం ఎస్సీ, 1.6 శాతం ఎస్టీ, 11.2 శాతం ఓబిసి, ఆర్థికంగా బలహీనపడిన వర్గాల నుండి, వికాలాంగుల కోటా నుండి కేటాయించిన అధ్యాపకులు ఉన్నారు. 
 
మొత్తంగా చూస్తే ఐఐటిల్లో గానీ, ఐఐఎంల్లో గానీ ఇంచుమించు అదే గణాంకాలు ఉన్నాయి. కానీ దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటి, ఐఐఎంల్లో అన్నింటిలో జనరల్‌ కేటగిరీకి చెందిన అధ్యాపకులే ఉంటారని చెప్పలేమని ఆర్‌టిఐ పేర్కొంది. పాట్నా ఐఐటిలో 38 శాతం ఓబిసి, ఎస్సీలు 22 శాతం, ఎస్టీలు 13 శాతం, జనరల్‌ కేటగిరీ 12 శాతం మందే ఉన్నారు. భిలారు, ఇండోర్‌ ఐఐటిల్లో 50 శాతం జనరల్‌ కేటగిరీకి చెందిన అధ్యాపకులు ఉన్నారు.
 
జమ్మూలో 51 శాతం జనరల కేటిగిరీ 19 శాతం ఎస్సీ, 5 శాతం ఎస్టీ, 23 శాతం ఓబిసి, 2 శాతం ఇతర కేటగిరీలకు చెందిన వారు అధ్యాపకులుగా ఉన్నారు. ఏడు ఐఐఎంల్లో 256 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆర్‌టిఐ డేటా తెలిపింది. ఈ పోస్టుల్లో 88 ఓబిసి కేటగిరీకి చెందినవి, 54 ఎస్సీ, 30 ఎస్టీ కేటగిరీకి చెందిన పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక ఐఐటిల్లో 1,557 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 451 ఓబిసి, 234 ఎస్సీ, 129 ఎస్టీ పోస్టులు ఉన్నాయని ఆర్‌టిఐ తెలిపింది.