పార్లమెంట్‌లో రాజ్యాంగంపై వచ్చే వారం చర్చ

పార్లమెంట్‌లో రాజ్యాంగంపై వచ్చే వారం చర్చ
పార్లమెంట్‌లో రాజ్యాంగంపై చర్చకు  విపక్షాలు డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో వచ్చే వారం రాజ్యాంగంపై చర్చకు లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలందరూ అంగీకరించారు. సోమవారం స్పీకర్‌ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 
 
సమావేశం అనంతరం రాజ్యాంగంపై చర్చ తేదీలను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజుజు ప్రకటించారు. లోక్‌సభలో డిసెంబర్‌ 13, 14 తేదీల్లో, రాజ్యసభలో 16, 17 తేదీల్లో రాజ్యాంగంపై చర్చ జరుగుతుందని స్పష్టం చేశారు. చర్చ అనంతరం రాజ్యాంగంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించనున్నట్లు తెలిసింది.

పార్లమెంట్  సమావేశాలు ప్రారంభమై ఐదు రోజులవుతున్నా.. ఎలాంటి చర్చలూ జరగడం లేదు. ఉభయసభల్లో నిత్యం వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఎలాంటి చర్చలూ జరగకుండానే వాయిదాలు పడుతుండటంపై విపక్ష కూటమి ఎంపీలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అదానీ వ్యవహారం, మణిపూర్ పరిస్థితి‌, సంభాల్ ఘటన‌, అజ్మేర్ ఘటన‌, నిరుద్యోగం మొదలైన అంశాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాలని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయని, కానీ ప్రభుత్వానికి మాత్రం వీటిపై చర్చ ఇష్టంలేదని విమర్శిస్తున్నారు. 

వీటితోపాటు రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రెండు రోజులపాటు రాజ్యాంగంపై ప్రత్యేకంగా చర్చ చేపట్టాలని తాము ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశామని, అందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపినా ఎప్పుడు చర్చ చేపడుతారనే విషయం మాత్రం ఇంకా వెల్లడించలేదని జైరామ్‌ రమేష్‌ మండిపడ్డారు.

ఈ నేపథ్యంలో స్పీకర్‌ ఓంబిర్లా అన్ని పార్టీల ఫ్లోర్‌ లీడర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. సోమవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఈ సమావేశం జరిగింది. మంగళవారం నుండి సభా కార్యకలాపాలు సజావుగా సాగేందుకు సహకరించాలని ఈ సమావేశంలో ఫ్లోర్‌ లీడర్లను స్పీకర్‌ కోరారు.  అఖిలపక్ష సమావేశంలో విపక్షాలు లేవనెత్తిన పలు అంశాలను చర్చించేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం వల్ల కేంద్రం, విపక్షాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. ముఖ్యంగా లోక్‌సభలో సంభాల్‌ అంశం, బంగ్లాదేశ్‌ పరిస్థితులపై చర్చించేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.