ఇండియా కూటమి ఎంపీల భేటీకి తృణమూల్‌ డుమ్మా

ఇండియా కూటమి ఎంపీల భేటీకి తృణమూల్‌ డుమ్మా
 
* నిముషాల వ్యవధిలో ఉభయ సభలు రేపటికి వాయిదా
 
పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలను అదానీ అంశం, యూపీలోని సంభల్‌ హింసాకాండ ఘటనలు కుదిపేస్తున్నాయి. ఈ అంశాలపై చర్చకు విపక్షాలు పట్టుపడుతుండటంతో ఉభయసభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం విపక్ష ఇండియా కూటమిలోని పార్టీలకు చెందిన ఎంపీలు సమావేశమయ్యారు.అ
 
అయితే, ఈ భేటీని కూటమిలో భాగంగా ఉన్న తృణమూల్‌ కాంగ్రెస్‌ దాటవేసింది.  సోమవారం పార్లమెంట్‌ సమావేశాలు వాయిదా పడిన అనంతరం కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఛాంబర్‌లో ఎంపీలంతా సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఉభయ సభల్లో ఎన్డీయే ప్రభుత్వాన్ని ఎదుర్కొనే వ్యూహంపై తీవ్రంగా చర్చలు జరిపినట్లు తెలిసింది. 
 
ఈ కీలక భేటీకి తృణమూల్‌ హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ధరల పెరుగుదల, నిరుద్యోగం, నిధుల కొరత, మణిపూర్‌ అంశం సహా ఆరు కీలక అంశాలను మాత్రమే పార్లమెంట్‌లో లేవనెత్తాలనుకుంటున్నట్లు ఆ పార్టీ (తృణమూల్‌) వర్గాలు తెలిపాయి. 
 
కానీ కాంగ్రెస్‌ మాత్రం అదానీ వ్యవహారంపై మాత్రమే ఒత్తిడి చేయాలనుకుంటోందని దీంతో నేడు ఇండియా కూటమి ఫ్లోర్‌ లీడర్ల సమావేశానికి హాజరుకావడం లేదని ఆ పార్టీ వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియా పేర్కొంది. తమ ప్రధాన అంశాలు ఎజెండాలో లేనప్పుడు సమావేశానికి హాజరు కాబోమని తృణమూల్‌ నేతలు స్పష్టంగా తెలి పినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి.
 
కాగా, పార్లమెంట్‌లో  వాయిదాల పర్వం కొనసాగుతోంది. యూపీలోని సంభల్‌లో చెలరేగిన హింస, అదానీ అవినీతి తదితర అంశాలపై చర్చ జరగాలంటూ విపక్షాలు పట్టుబట్టడంతో ఉభయ సభల కార్యక్రమాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. సోమవారం కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. సమావేశాలు ప్రారంభమైన గంట వ్యవధిలోనే ఉభయ సభలు మంగళవారానికి వాయిదా పడ్డాయి.

శుక్రవారం వాయిదా పడిన ఉభయ సభలు తిరిగి సోమవారం ఉదయం 11 గంటలకు సమావేశమయ్యాయి. ఎగువ, దిగువ సభలు ప్రారంభం కాగానే సభలో అదానీ, సంభల్‌లో హింసాకాండపై చర్చకు విపక్ష ఎంపీలు పట్టుబట్టారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో లోక్‌సభను మధ్యాహ్నం 12 వరకూ వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు. 

ఇక సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా నిరసనలు కొనసాగాయి. దీంతో సభను రేపటికి వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. దీంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌ ప్రకటించారు