కాంగ్రెస్ తో పొత్తు ఉండదని తేల్చి చెప్పిన కేజ్రీవాల్

కాంగ్రెస్ తో పొత్తు ఉండదని తేల్చి చెప్పిన కేజ్రీవాల్

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం తమ పార్టీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోదని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్  కీలక ప్రకటన చేశారు. అన్నారు.  ఢిల్లీలో తాము ఏ పార్టీతో ఎలాంటి పొత్తు పెట్టుకోబోమని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని స్పష్టం చేశారు. 

వరుసగా మూడోసారి నేషనల్ క్యాపిటల్ టెరిటరీలో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు పొత్తులు లేకుండా ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. బీజేపీపై పోరుకు ఆప్, కాంగ్రెస్ చేతులు కలుపుతాయంటూ గతంలో ఊహాగానాలు వినిపించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఆదివారంనాడు ఏర్పాటు చేసిన సమావేశంలో దీనిపై కేజ్రీవాల్ స్పష్టత ఇచ్చారు. 

హర్యానాలో కాంగ్రెస్ తో పొత్తు కోసం పలు దఫాలు రెండు పార్టీల మధ్య చర్చలు జరిగాయి. అయితే, చివరి నిముషంలో అత్యంత అవమానకరంగా కాంగ్రెస్ ఆప్ తో పొత్తు లేకుండా పోటీ చేయడంతో కేజ్రీవాల్ ఆగ్రహంగా ఉన్నారు. అప్పటి నుండి కాంగ్రెస్ కు దూరంగా ఉంటూ వస్తున్నారు. వాస్తవానికి ఇంతకు ముందే, డిల్లీ ఎన్నికల్లో పొత్తు లేకుండా చేస్తామని కాంగ్రెస్‌ కూడా ప్రకటించింది.

వాస్తవానికి ఈ ఏడాది ప్రారంభంలో డిల్లీలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆప్‌, కాంగ్రెస్ రెండూ కలిసి పోటీ చేశాయి. కానీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయాయి. మొత్తం లోక్‌ సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. అలాగే ఈ ఏడాది పంజాబ్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకోవడానికి ఆప్‌ నిరాకరించి, 13 స్థానాల్లో ఒంటరిగా బరిలోకి దిగింది. ఇక హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇరుపార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కుదరలేదు.

కాగా, ఢిల్లీలో శాంతి భద్రతల పరిస్థితిపై బీజేపీని తప్పుపట్టారు. ”శాంతిభద్రతలు అంశాన్ని నేను ప్రస్తావించిన తరువాతైనా అమిత్‌షా చర్యలు తీసుకుంటారని ఆశించాను. అందుకు బదులుగా పాతయాత్రలో నాపై దాడి జరిగింది. ద్రావకాన్ని నాపై విసిరారు. ఎలాంటి హాని జరగకపోయినా కానీ అది ప్రమాదకారి కావచ్చు” అని కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు.

కాగా, ఆప్ ఎమ్మెల్యే నరేష్ బల్యాన్‌ను శనివారం అరెస్టు చేశారని, ఆయన చేసిన నేరమల్లా గ్యాంగ్‌స్టర్ల బాధితుడు కావడమేనని కేజ్రీవాల్ చెప్పారు. గ్యాంగ్‌స్టర్ల నంచి డబ్బులు డిమాండ్ చేస్తూ ఆయనకు బెదిరింపులు వచ్చాయని, ఆయన అనేకసార్లు ఫిర్యాదులు కూడా చేశారని తెలిపారు. 

కాగా, కేజ్రీవాల్ గ్రేటర్ కైలాస్ ఏరియాలో పాదయాత్ర చేస్తుండగా ద్రావకంతో దాడి జరిగన విషయాన్ని ఆయనతో కలిసి పాదయాత్రలో పాల్గొన్న సౌరభ్ భరద్వాజ్ ధ్రువీకరించారు. ఆ ద్రావకం స్పిరిట్ అని చెప్పారు. కేజ్రీవాల్‌కు హాని చేసే ఉద్దేశంతోనే ఈదాడి జరిగిందని ఆరోపించారు. దాడికి యత్నించిన వ్యక్తి చేతిలోని ద్రావకం స్పిరిట్ వాసన వచ్చిందని, అతని మరో చేతిలో అగ్గిపెట్టి ఉందని వివరించారు.