సీడబ్ల్యూసీ సమావేశంకు తెలంగాణ, కర్ణాటక సీఎంల గైరాజర్!

సీడబ్ల్యూసీ సమావేశంకు తెలంగాణ, కర్ణాటక సీఎంల గైరాజర్!
 
ఇటీవల జరిగిన ఎన్నికలే ప్రధాన ఎజెండాగా శుక్రవారం దలేహీలో నిర్వహించిన కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంకు తెలంగాణ, కర్ణాటక ముఖ్యమంత్రులు గైరాజర్ కావడం ఆసక్తి కలిగిస్తున్నది. వారిద్దరికీ ఆహ్వానాలు అందలేదని చెబుతున్నారు. తొలుత ఏఐసీసీ నుంచి రేవంత్‌రెడ్డికి ఆహ్వానం అందింది. దీంతో ఆయన రాష్ట్రంలో అధికారిక కార్యక్రమాలేవి పెట్టుకోకుండా ఢిల్లీ వెళ్లటానికి సిద్ధమయ్యారు. 
 
కానీ అనూహ్యంగా ఆయన స్థానంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు పిలుపు రావటం గాంధీభవన్‌ వర్గాల్లో కలకలం రేపుతోంది.  మహారాష్ట్రలో కాంగ్రెస్‌ కూటమి ఓటమికి తెలంగాణ, కర్ణాటక రాష్ర్టాల్లోని కాంగ్రెస్‌ పరిపాలన విధానం కూడా ఓ కారణం అని అధిష్ఠానం భావిస్తున్నట్టు తెలిసింది. ప్రధానంగా హామీ ఇచ్చిన గ్యారెంటీల అమలులో ఇటు తెలంగాణ అటు కర్ణాటక ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. 
 
అవే తరహా గ్యారెంటీలను కాంగ్రెస్‌ కూటమి మహారాష్ట్రలోనూ ప్రకటించింది. ఈ గ్యారెంటీల ప్రకటనతోనే కూటమికి దెబ్బపడ్డదని, ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదని అధిష్ఠానం ఒక అంచనాకు వచ్చినట్టు సమాచారం. అధికారంలో ఉన్న కూటమిపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నదని, కానీ దాన్ని తమకు అనుకూలంగా మలచుకోవడంలో విఫలమయ్యామని కాంగ్రెస్‌ భావిస్తున్నది. 
 
ఇది సవాల్‌ సమయం అని, ఎన్నికల ఫలితాలను విశ్లేషించి తక్షణమే గుణపాఠాలు నేర్చుకొని భవిష్యత్తులో పార్టీని బలోపేతం చేయాలని ఏఐసీసీ పెద్దలు నిర్ణయించారు. ఇలాంటి కీలకమైన సమావేశానికి తెలంగాణ, కర్ణాటక  ముఖ్యమంత్రులను వద్దని చెప్పటం పట్ల ఏం జరుగబోతున్నదనే చర్చ కాంగ్రెస్‌ వర్గాల్లో ఊపందుకున్నది.విదర్భ ప్రాంతంలోని నాగ్‌పూర్‌, గడ్చిరోలి, చంద్రాపూర్‌, గోండియా, మరఠ్వాడా ప్రాంతంలోని నాందేడ్‌, పర్భని, వార్ధా తదితర జిల్లాలు తెలంగాణకు సరిహద్దుగా ఉన్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి ఇవే జిల్లాలలో ప్రచారం నిర్వహించారు. ఆయన ప్రచారం చేసిన ఒక్క నియోజకవర్గంలో తప్ప కాంగ్రెస్‌ పార్టీ మరెక్కడా గెలవలేదు. 

ఓటమికి గల కారణాల మదింపు జరుగుతున్న సమయంలో ఆయన సలహాలు ఏమీ అవసరం లేదన్నట్టుగా రేవంత్‌ను పక్కన పెట్టడం వెనుక కాంగ్రెస్‌ పార్టీ వ్యూహం ఏమిటనేది రాజకీయ వర్గల్లో చర్చనీయాంశమైంది. రేవంత్‌రెడ్డినే కాకుండా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కూడా సమావేశాలకు ఆహ్వానించలేదు. ఆయనకు బదులుగా కూడా ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ హాజరైనట్టు తెలిసింది.

అయితే, ఏఐసీసీ సమావేశం ఎజెండాలో రాష్ట్రానికి సంబంధించిన ఆంశాలేమీ లేవని, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన భట్టిని, అక్కడి ప్రభుత్వ ఏర్పాటులో సలహాలు సూచనలు ఇవ్వాలని ఆహ్వానించారని పార్టీ వర్గాలు సర్దిచెప్పుకొనే ప్రయత్నం చేస్తున్నాయి.