అదానీకి అమెరికా కోర్టు సమన్లపై అధికారిక సమాచారం లేదు 

అదానీకి అమెరికా కోర్టు సమన్లపై అధికారిక సమాచారం లేదు 
ముడుపుల ఆరోపణల కేసుకు సంబంధించి అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఇతరులకు అమెరికా ప్రాసిక్యూటర్లు సమన్లు జారీ చేసినట్లు సూచించిన మీడియా కథనాలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఇఎ) శుక్రవారం తోసిపుచ్చింది. ఈ విషయానికి సంబంధించి అమెరికా నుండి సమన్లు లేదా అరెస్ట్ కోసం అధికారిక అభ్యర్థన ఏదీ భారత్ కు అందలేదని స్పష్టం చేశారు.  విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, ఇది ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులు, అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్‌కు సంబంధించిన చట్టపరమైన విషయం అని తెలిపారు. “సమన్లు లేదా అరెస్ట్ వారెంట్ సేవ కోసం విదేశీ ప్రభుత్వం చేసే ఏదైనా అభ్యర్థన పరస్పర న్యాయ సహాయంలో భాగం. అటువంటి అభ్యర్థనలను మెరిట్‌ల ఆధారంగా పరిశీలిస్తారు” అని జైస్వాల్ చెప్పారు.

 “యుఎస్ వైపు నుండి ఈ కేసుపై మాకు ఎటువంటి అభ్యర్థన రాలేదు,” అని స్పష్టం చేశారు. “అటువంటి కేసులలో ఏర్పాటు చేసిన విధానాలు, చట్టపరమైన మార్గాలు ఉన్నాయి. వాటిని అనుసరిస్తారని మేము విశ్వసిస్తున్నాము. ఈ సమస్య గురించి భారత ప్రభుత్వానికి ముందుగానే తెలియచేయలేదు. మేము అమెరికా ప్రభుత్వంతో ఈ విషయం గురించి కూడా ఎటువంటి సంప్రదింపులు జరపలేదు” అని తెలిపారు.

గౌతమ్ అదానీ, ఇతర ఎగ్జిక్యూటివ్‌లు యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆఫ్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్‌కి సంబంధించిన ఐదు కేసులలో నేరారోపణలో ఉన్నారని, వారిపై ముడుపులు,  మోసం ఆరోపణలతో ముడిపెట్టారని ఆరోపిస్తూ మీడియా నివేదికలు వెలువడ్డాయి. నవంబర్ 27న, స్టాక్ ఎక్స్ఛేంజీలకు దాఖలు చేసిన ఆరోపణలను అదానీ గ్రూప్ నిర్ద్వంద్వంగా ఖండించింది.

ఈ కేసులో దాని వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీ, అదానీ గ్రీన్ ఎనర్జీ ఎండి- సీఈఓ వినీత్ జైన్‌లను నిందితులుగా పేర్కొంటూ అమెరికా  డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్, అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ చేసిన వాదనలను అదానీ గ్రూప్ తోసిపుచ్చింది.