వెనక్కి తగ్గిన రేవంత్ సర్కార్‌.. లగచర్ల భూ సేకరణ నిలిపివేత

వెనక్కి తగ్గిన రేవంత్ సర్కార్‌.. లగచర్ల భూ సేకరణ నిలిపివేత
వికారాబాద్ జిల్లా పరిధిలోని లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం భూసేకరణ చేయాలని తలపెట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం గిరిజనుల తిరుగుబాటుతో వెనక్కి తగ్గింది. లగచర్ల భూసేకరణను నిలిపివేస్తున్నట్లు శుక్రవారం నాడు ఒక ప్రకటన విడుదల చేసింది. తమ ప్రాంతంలో ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేయవద్దని… భూములను తీసుకోవద్దని గిరిజనులు ఆందోళనలు చేస్తున్నారు.

లగచర్ల ఫార్మాపై అభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్‌, అధికారులపై రైతుల దాడి ఘటనను ముందుగా పసిగట్టలేకపోవడం నిఘా వైఫల్యమేనన్న విమర్శలు వెల్లువెత్తాయి. లగచర్ల ఘటన అనంతరం అరెస్టులు, పోలీసుల మోహరింపులతో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగా మారింది. అర్ధరాత్రి వేళ రేవంత్‌ సర్కార్‌ అండతో పోలీసులు చేసిన దమనకాండతో రాష్ట్రం అట్టుడికింది. 

దీంతో బాధితులు జాతీయ మానవ హక్కుల కమిషన్‌ దగ్గర వరకూ వెళ్లారు. ఈ క్రమంలోనే ఎన్‌హెచ్‌ఆర్సీ దీనిపై విచారణ కూడా చేపట్టింది. ఇలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడం గమనార్హం. దీనితో దుద్యాల మండలం లగచర్లలో భూసేకరణను నిలిపివేస్తున్నట్లు ప్రకటన ఇచ్చింది. 2013లోని సెక్షన్ 93 ప్రకారం ఉపసంహరణ నోటిఫికేషన్ ఇస్తున్నట్లు పేర్కొంది.

వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల, పోలేపల్లి, హకీంపెట్ గ్రామాల్లో ఫార్మా విలేజ్ ఏర్పాటు చేయాలని సర్కార్ నిర్ణయించింది. భూసేకరణ చేస్తున్నట్లు 19 జూలై 2024 రోజున గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఈ దిశగానే అడుగులు వేస్తూ వచ్చింది. అయితే స్థానికంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో రేవంత్ సర్కార్ వెనక్కి తగ్గింది.

లగచర్లలో గిరిజనుల ఆందోళనలపై కూడా ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ఇటీవలే స్పందిస్తూ లగచర్లలో ఏర్పాటు చేసేది ఫార్మా కంపెనీ కాదని, పారిశ్రామిక కారిడార్ అని మాటమార్చారు. నియోజకవర్గంలో యువత, మహిళలకు ఉపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ఇండస్ట్రియల్ కారిడార్‌ను ప్రతిపాదించినట్టు చెప్పారు.

 సొంత నియోజకవర్గ ప్రజలకు ప్రయోజనం చేయడమే తప్ప ఎవరికీ నష్టం కలిగించడం లేదని చెప్పారు. ఉపాధికి అవకాశాలు పెంచే దిశగా ఇండస్ట్రియల్ కారిడార్‌లో కాలుష్య రహిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు.

“2009 నుండి  కొడంగల్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాను. అత్యంత వెనకబడిన నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న తపన ఉంది. నా ప్రజలకు మేలు చేయాలన్న తపన, తలంపే తప్ప వారిని ఇబ్బంది పెట్టాలని నేనెందుకు అనుకుంటాను. అటువంటి ఆలోచన కలలో కూడా చేయనని వామపక్ష నేతలతో నా ఆలోచన పంచుకున్నాను” అని కూడా సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

భూసేకరణ ప్రక్రియలో కూడా పరిహారం పెంచే విషయంపై కూడా ఆలోచిస్తామని సీఎం రేవంత్ చెప్పారు. అయితే ఆ దిశగా సర్కార్ నుంచి కీలక ప్రకటన వస్తుందని అంతా భావించారు. కానీ గిరిజనుల ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. భూసేకరణ ప్రక్రియను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. 580 మంది రైతులకు చెందిన 532 ఎకరాల భూసేకరణను నిలిపివేశారు.