బిర్సా ముండా ముని మనవడు మంగళ్‌ ముండా మృతి

బిర్సా ముండా ముని మనవడు మంగళ్‌ ముండా మృతి

ఆదివాసీల ఆరాధ్య‌దైవం, గిరిజ‌న వీరుడు బిర్సా ముండా ముని మ‌న‌వ‌డు మంగ‌ల్ ముండా ఇవాళ మృతిచెందారు. రోడ్డు ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డ్డ అత‌ను ఓ ఆస్ప‌త్రిలో చికిత్స పొందారు. అయితే గుండెపోటు రావ‌డంతో ఆయ‌న ప్రాణాలు విడిచారు. మంగ‌ల్ ముండా వ‌య‌సు 45 ఏళ్లు. అర్థ‌రాత్రి 12.30 నిమిషాల‌కు ఆయ‌న తుదిశ్వాస విడిచారు. 

రాంచీలో ఉన్న రాజేంద్ర ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్‌లో ఆయ‌న మృతిచెందారు. జార్ఖండ్‌లోని ఖుంతి జిల్లాలో జ‌రిగిన ప్ర‌మాదంలో వాహ‌నం రూఫ్ మీద నుంచి మంగ‌ల్ ముండా కింద‌ప‌డిపోయారు.

ఈయన మృతికి ప్రధాని నరేంద్ర మోదీ, జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌లు సంతాపం తెలిపారు. ఈ మేరకు వారు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. ప్రధాని మోదీ ‘బిర్సా ముండా వారసుడు మంగళ్‌ ముండా మృతిపట్ల నేను విచారం వ్యక్తం చేస్తున్నాను. ఆయన మరణం తన కుటుంబానికే కాదు.. గిరిజన సమాజానికి తీరని లోటు’ అని ఎక్స్‌ పోస్టులో పేర్కొన్నారు.

‘రిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళ్‌ ముండా మృతి చెందారు. ఆయన మరణ వార్త నన్ను చాలా బాధకు గురిచేసింది. ఇలాంటి క్లిష్ట సమయంలో దు:ఖాన్ని భరించే శక్తిని వారి కుటుంబ సభ్యులకి ఇవ్వాలని కోరుకుంటున్నాను’ అని జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ ఎక్స్‌ పోస్టులో పేర్కొన్నారు. ఇక జార్ఖండ్‌ గవర్నర్‌ సంతోష్‌ కుమార్‌ గంగ్వార్‌ కూడా మంగళ్‌ ముండా మృతికి సంతాపం తెలిపారు.

నవంబర్‌ 25వ తేదీ మంగళ్‌ ముండా రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయాలపాలై చికిత్స కోసం రిమ్స్‌ ఆసుపత్రిలో చేరారని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌కు చెందిన రాజీవ్‌ రంజన్‌ తెలిపారు. ఈ ప్రమాదంలో ఆయన తలకు, మెదడుకు తీవ్రంగా గాయాలయ్యాయి. నవంబర్‌ 26వ తేదీన ఓ ఆపరేషన్‌ కూడా చేశాము. అయినప్పటికీ ఆయన ఆరోగ్యం విషమించింది. ఐసియులో వెంటిలేటర్‌ సపోర్టుపై ఉంచాము. చివరకు ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లు రంజన్‌ చెప్పారు.