ఇజ్రాయెల్‌ – హెజ్బొల్లా మధ్య ఆగిన బాంబుల మోత

ఇజ్రాయెల్‌ – హెజ్బొల్లా మధ్య ఆగిన బాంబుల మోత
 
* కాల్పుల విరమణకు తామూ సిద్ధమని హమాస్ ప్రకటన
 
పశ్చిమాసియాలో కొన్ని నెలలుగా రగులుతున్న నిప్పుకణికలు కాస్త చల్లారాయి. ఇజ్రాయెల్-హెజ్​బొల్లా మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రాగా, ఎట్టకేలకు లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు నిలిచిపోయాయి. దీంతో చాలా ప్రాంతాల్లో ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇజ్రాయెల్-హమాస్ మధ్య 14 నెలల క్రితం మొదలైన యుద్ధం ముగియడానికి ఈ ఒప్పందం కీలక ముందడుగుగా అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ అభివర్ణించారు.

బుధవారం ఉదయం ఏడున్నర గంటల నుంచి కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఒప్పందం ప్రకారం 60 రోజుల వ్యవధిలో ఇజ్రాయెల్‌ తన బలగాలను ఉపసంహరించుకోవాల్సి ఉండగా, లెబనాన్ సైన్యం తమ సరిహద్దులోని భూభాగాన్ని నియంత్రణలోకి తీసుకుంటుందని జో బైడెన్ తెలిపారు.

దక్షిణ ప్రాంతంలో లెబనాన్ దళాలతో పాటు ఐరాస శాంతి బృందాలను మోహరించనుండగా అక్కడి పరిస్థితులను అమెరికా సారథ్యంలోని అంతర్జాతీయ బృందం పర్యవేక్షిస్తుందని బైడెన్ తెలిపారు. రానున్న రోజుల్లో గాజాలోనూ కాల్పుల విరమణ, బందీల విడుదలకు టర్కీ, ఈజిప్టు, ఖతార్‌ నాయకులతో చర్చలు జరుపుతామని వివరించారు. ఇజ్రాయెల్‌ -హెజ్‌బొల్లా మధ్య కుదిరిన ఒప్పందంలో కీలకపాత్ర పోషించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్‌ కూడా తాజా పరిణామాన్ని స్వాగతించారు. లెబనాన్ సార్వభౌమత్వాన్ని ఇజ్రాయెల్‌ గౌరవించాలని కోరారు.

మరోవైపు ఈ కాల్పుల ఒప్పందాన్ని భారత్​ స్వాగతించింది. తాజా పరిణామాలు శాంతి, స్థిరత్వానికి దారితీస్తాయని ఆశిస్తున్నట్లుగా భారత విదేశీ వ్యవహారాల శాఖ ఈ మేరకు ఓ ప్రకటను విడుదల చేసింది. దౌత్యం, చర్చలు ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని భారత్​ ముందు నుంచే చెబుతుందని తెలిపింది.

మొదట 60 రోజుల కోసం ఒప్పందం కుదిరినా, శాశ్వత ఒప్పందంగా కొనసాగే అవకాశం ఉంది. ఈ ఒప్పందాన్ని ఇరాన్‌, పాలస్తీనా సహా అన్ని దేశాలూ స్వాగతించాయి. కాల్పుల విరమణ ఒప్పందానికి తామూ సిద్ధంగా ఉన్నట్టు హమాస్‌ ప్రకటించింది. గత ఏడాది అక్టోబర్‌ 7న మొదలైన సంక్షోభం క్రమంగా కొలిక్కి వస్తున్నది.

కాగా, తాము కూడా ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ఒప్పందానికి సిద్ధంగా ఉన్నామని హమాస్‌ ప్రకటించింది. కాల్పుల విరమణ, ఖైదీల అప్పగింత ఒప్పందానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని ఈజిప్ట్‌, ఖతార్‌, తుర్కియేలోని మధ్యవర్తులకు చెప్పామని తెలిపింది.

కాల్పుల విరమణ ఒప్పందం జరగడంతో లెబనాన్‌ ప్రజలు సంబరాలు చేసుకున్నారు. దక్షిణ లెబనాన్‌ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయిన ప్రజలు వేలాదిగా మళ్లీ తమ స్వస్థలాలకు వెళ్తున్నారు. బలగాల ఉపసంహరణ పూర్తయ్యే వరకు దక్షిణ లెబనాన్‌కు రావొద్దని ఇజ్రాయెల్‌, లెబనాన్‌ సైన్యాలు హెచ్చరించినప్పటికీ ప్రజలు పట్టించుకోవడం లేదు. మొత్తం 12 లక్షల మంది ఈ ప్రాంతం నుంచి తమ ఇండ్లను వదిలి వెళ్లిపోయారు.