
గ్యారెంటీల పేరుతో అలవికాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వరుసగా ప్రజల నడ్డి విరిచే చర్యలకు దిగుతున్నది. ఇప్పటికే పెట్రో, పాలు, మద్యం, స్టాంప్ డ్యూటీ వంటివి పెంచిన సిద్ధరామయ్య సర్కారు ఇప్పుడు ప్రభుత్వ వైద్యాన్నీ ప్రజలకు భారంగా మార్చింది.
బెంగళూరు మెడికల్ కాలేజ్ అండ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(బీఎంసీఆర్‌ఐ) పరిధిలోని ప్రభుత్వ దవాఖానల్లో చార్జీలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాదాపు 50 – 100 శాతం వరకు ధరలను పెంచేసింది. పేద, మధ్యతరగతి వర్గాలు వైద్యం కోసం ఎక్కువగా ఆధారపడే బెంగళూరులోని విక్టోరియా హాస్పిటల్, వాణి విలాస్ హాస్పిటల్, మింటో హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు ట్రామా కేర్ సెంటర్లలో వైద్య సేవలకు చార్జీలు పెరిగాయి.
ఇప్పటివరకు రక్తపరీక్షకు రూ.70 ఉండగా ఇప్పుడు ఏకంగా రూ.120కు ప్రభుత్వం పెంచింది. స్పెషల్ వార్డులో సింగిల్ బెడ్ చార్జీ ఒక రోజుకు రూ.750 ఉండగా ఇప్పుడు రూ.2,000కు, దవాఖాన వ్యర్థాల నిర్వహణ చార్జీలను రూ.10 నుంచి రూ.50కు, వార్డు చార్జీలను రూ.25 నుంచి రూ.50కు, ఔట్‌పేషెంట్ చార్జీలు రూ.10 నుంచి రూ.20కు, ఇన్‌పేషెంట్ చార్జీలు రూ.25 నుంచి రూ.50కు పెంచినట్టు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయడానికి వారిపైనే భారం వేస్తున్నదని, వరుసగా అన్ని చార్జీలు పెంచుతున్నదని ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్ విమర్శిస్తున్నాయి. అయితే, చార్జీలను పెద్దగా ఏమీ పెంచలేదని, కేవలం సవరించామని వైద్య శాఖ మంత్రి దినేశ్ గుండూరావు పేర్కొన్నారు. ఇది పెద్ద విషయం కాదని, ప్రజలపై భారం కాదని చెప్పుకొచ్చారు.
కాగా, ఇప్పటికే మద్యంపై గత ఏడాది జూలైలో, ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండుసార్లు ఎక్సైజ్ డ్యూటీని 10 శాతం చొప్పున పెంచింది. పెట్రోల్, డీజిల్‌పై సేల్స్ ట్యాక్స్ పెంచడంతో లీటరుకు రూ.3 చొప్పున ధరలు పెరిగాయి. ప్రభుత్వానికి చెందిన నందిని పాల ధరల లీటరుకు రూ.2 పెంచింది.
More Stories
కేజ్రీవాల్ అధికారిక నివాసం `శీష్‌మహల్’ పై సివిసి దర్యాప్తు
తగ్గనున్న వంట నూనెల ధరలు
2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపు