అమెరికా ప్రాసిక్యూటర్లు చేస్తున్న కేవలం నేరారోపణలు మాత్రమేనని అదానీ గ్రూపు ప్రతినిధి పేర్కొన్నారు. దోషులుగా రుజువయ్యే వరకు నిందితులను నిర్దోషులుగానే భావించాల్సి ఉంటుందని పేర్కొంటూ పాలనా వ్యవహారాల్లో, పారదర్శకత విషయంలో అదానీ గ్రూపు ఎప్పుడూ అత్యున్నత ప్రమాణాలు పాటిస్తుందని తెలిపారు.
తాము కార్యకలాపాలు నిర్వహించే ప్రతిచోట వీటిని పాటిస్తూ వస్తున్నామని చెప్పారు. చట్టాలను గౌరవిస్తూ, వాటికి లోబడి నడుచుకుంటున్నందున వాటాదారులు, భాగస్వాములు, ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. సోలార్ పవర్ ప్రాజెక్టులు దక్కించుకోవడంలో భాగంగా అదానీ గ్రూపు రూ.2,100 కోట్లు భారత అధికారులకు లంచం ఇవ్వజూపిందన్న ఆరోపణలతో పాటు, దాని గురించి ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చారంటూ అమెరికాలో అభియోగాలు నమోదయ్యాయి.
గౌతమ్ అదానీ సహా మరో ఏడుగురిపై కేసులు నమోదైనట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు. తమ దర్యాప్తు దూకుడుగా కొనసాగుతుందని జస్టిస్ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ అసిస్టెంట్ అటార్నీ లీసా హెచ్ మిల్లర్ తెలిపారు. ప్రపంచంలో ఏమూలైనా అమెరికా చట్టాలను ఉల్లంఘించినా సహించబోమని వెల్లడించారు.
మరోవైపు, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించిన అనంతరం గౌతమ్ అదానీ శుభాకాంక్షలు చెప్పారు. తాను అమెరికాలో 10 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టి 15,000 ఉద్యోగాలు సృష్టిస్తానని అందులో పేర్కొన్నారు. తాజాగా ఈ కేసుకు ఆదేశాలు జారీ చేసిన ప్రాసిక్యూటర్ బ్రియాన్ పీస్‌ను బైడెన్ కార్యవర్గం నియమించింది. ఈ నేపథ్యంలో ట్రంప్ అధికారంలోకి రాగానే పీస్ పదవి నుంచి దిగిపోవచ్చని భావిస్తున్నారు. తాజా పరిణామాలపై శ్వేతసౌధం కానీ, ట్రంప్ ట్రాన్సిషన్ టీమ్ కానీ ఇంకా స్పందించలేదు.
More Stories
ఉబర్, ఓలాలకు కేంద్రం నోటీసులు
రాంగోపాల్ వర్మకు చెక్‌బౌన్స్ కేసులో జైలు శిక్ష!
సైఫ్ అలీఖాన్ కుటుంభం రూ. 15,000 కోట్ల ఆస్తుల జప్తు!