గౌతమ్‌ అదానీకి యూఎస్‌ సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ సమన్లు

గౌతమ్‌ అదానీకి యూఎస్‌ సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ సమన్లు
అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు గౌతమ్‌ అదానీతో పాటు ఆయన మేనల్లుడు సాగర్‌కు యూఎస్‌ సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ (ఎస్ఈసి) సమన్లు జారీ చేసింది. సోలార్ ఎనర్జీ కాంట్రాక్టులను పొందేందుకు 265 మిలియన్ డాలర్ల (రూ.2,200 కోట్లు) లంచం ఇచ్చారన్న ఆరోపణలపై తమ వైఖరిని స్పష్టం చేయాలని కమిషన్‌ కోరింది. 
 
అహ్మదాబాద్‌లోని అదానీ శాంతివన్‌ ఫామ్‌ నివాసానికి, అలాగే మేనల్లుడు సాగర్‌ బోడక్‌దేవ్‌ నివాసానికి సమన్లు పంపింది. ఈ నెల 21న న్యూయార్క్‌ ఈస్ట్రన్‌ కోర్టు నుంచి నోటీసులు పంపింది. సమన్లు అందుకున్న 21 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని చెప్పింది. అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ గౌతమ్ అదానీ అమెరికన్ ఇన్వెస్టర్లను మోసం చేశారని, ప్రభుత్వ అధికారులకు లంచం ఇచ్చినట్లు యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఆరోపించిన విషయం తెలిసిందే
 
సోలార్ ప్రాజెక్ట్ కాంట్రాక్టులు పొందేందుకు భారతీయ అధికారులకు 250 మిలియన్ డాలర్లు లంచం ఇచ్చినట్లు అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ అమెరికాలో క్రిమినల్ అభియోగాలను ఎదుర్కొంటున్నారు. గౌతమ్ అదానీపై విదేశీ లంచం, సెక్యూరిటీల మోసం, వైర్‌ఫ్రాడ్ కుట్ర, సంబంధిత అభియోగాలు నమోదైన విషయం తెలిసిందే. 
 
రెండు దశాబ్దాల్లో రెండు బిలియన్ డాలర్ల విలువైన సోలార్ కాంట్రాక్టులు దక్కించుకునేందుకు అదానీ 250 మిలియన్ డాలర్లకుపైగా లంచం ఇచ్చినట్లు ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. అయితే, అదానీ గ్రూప్‌ ఆరోపణలను ఖండించింది. కంపెనీ కార్యకలాపాలు అన్ని రంగాల్లో పారదర్శకత, నిబద్ధతను ప్రదర్శిస్తామని పేర్కొంది. వాటాదారులు, భాగస్వాములు, ఉద్యోగులకు పూర్తిగా కట్టుబడి ఉండే చట్టాలను గౌరవించే సంస్థ అని పేర్కొంది.