తిరుమలలో సర్వదర్శనం రెండు మూడు గంటల్లోనే

తిరుమలలో సర్వదర్శనం రెండు మూడు గంటల్లోనే
తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పాలకమండలి ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో సమావేశమై తిరుమలలో శారదా పీఠానికి కేటాయించిన భవనాన్ని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. శారదా పీఠం లీజు రద్దు చేసింది. టీటీడీలో అన్యమత ఉద్యోగుల సేవలకు చెక్ పెట్టడంతో పాటు దేవస్థానంలో అతిథి గృహాలకు సొంత పేర్లు పెట్టకూడదని నిర్ణయించింది.

రెండు, మూడు గంటల్లోనే సర్వదర్శనం భక్తులకు దర్శనం అయ్యేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజన్స్ ఉపయోగించి క్యూ లైన్లలో భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా 2 లేదా 3 గంటల్లోనే దర్శనమయ్యేలా ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. ఈ కమిటీ ఇచ్చే రిపోర్టు ఆధారంగా భక్తులకు త్వరితగతిన దర్శనం అయ్యేలా చర్యలు తీసుకోనున్నారు.

టీటీడీ పనిచేస్తోన్న అన్యమత ఉద్యోగులను ప్రభుత్వానికి అప్పగించాలని బోర్డు నిర్ణయించింది.  శ్రీ‌వాణి ట్రస్టు పేరును మార్చేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించి వచ్చే సమావేశంలో ఒక రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు. తిరుపతి శ్రీనివాస సేతుఫ్లై ఓవర్ కు గరుడ వారధిగా నామకరణం చేయాలని నిర్ణయించినట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. 

తిరుమల డంపింగ్‌ యార్డులోని చెత్తను మూడు నెలల్లోనే తొలగిస్తామని, తిరుమలలో రాజకీయాలు మాట్లాడకుండా నిషేధం విధించాలని నిర్ణయించామని తెలిపారు. టీటీడీ చెందిన నగదును ప్రైవేటు బ్యాంకుల్లో నుంచి ప్రభుత్వ బ్యాంకుల్లోకి బదలాయిస్తామని, పర్యాటకం ద్వారా దర్శన టికెట్లను పూర్తిగా రద్దు చేస్తున్నామని స్పష్టం చేశారు. 

నూతనంగా నిర్మిస్తున్న ముంతాజ్‌ హోటల్‌ అనుమతులు రద్దు చేస్తున్నామని ప్రకటించారు. తిరుపతి ప్రజలకు ప్రతినెల మొదటి మంగళవారం దర్శనానికి అవకాశం కల్పిస్తామని బీఆర్‌ నాయుడు చెప్పారు. అలిపిరిలో దేవలోక్‌ సంస్థకు కేటాయించిన 20 ఎకరాల భూమిని టీటీడీకి అప్పగించే విధంగా ప్రభుత్వానికి లేఖ రాస్తామని బీఆర్ నాయుడు తెలిపారు. 

అన్నప్రసాదంలో మరో ఐటమ్‌ను భక్తులకు వడ్డించాలని నిర్ణయించారు. శ్రీవారి ప్రసాదాల్లో నాణ్యమైన నెయ్యి వినియోగించేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారు. టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానాన్ని రూ.14 వేల నుంచి రూ.15,400లకు పెంచుతూ పాలక మండలి నిర్ణయం తీసుకుంది.

పర్యటక శాఖకు కేటాయిస్తున్న 4 వేల దర్శనం టిక్కెట్లు రద్దు చేస్తునట్లు  బీఆర్ నాయుడు తెలిపారు. వివిధ రాష్ట్రాలకు చెందిన టూరిజం కార్పొరేషన్లు, ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీలకు టీటీడీ కేటాయించిన శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) టికెట్లకు సంబంధించి అవకతవకలు జరిగాయన్న ఫిర్యాదులు నేపథ్యంలో ఆ కోటాను పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయం. శ్రీ‌వారి ఆల‌యంలో లీకేజీల నివార‌ణ‌కు, అన్న ప్రసాద కేంద్రం ఆధునీక‌ర‌ణ‌కు టీవీఎస్ సంస్థతో ఎంఓయూ. ఈ ప‌నులు ఉచితంగా చేయ‌నున్న టీవీఎస్ సంస్థ.