వాతావరణ నిధులను ‘పెట్టుబడి లక్ష్యాలు’గా చూడవద్దు

వాతావరణ నిధులను ‘పెట్టుబడి లక్ష్యాలు’గా చూడవద్దు
పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలు శిలాజ ఇంధనాల నుంచి పునరుత్పాదక ఇంధన వనరుల వైపు మళ్లేలా ప్రోత్సహించడాన్ని, వినియోగాన్ని సులభతరం చేయడానికి అవసరమైన ఆర్థిక సాయం అందించడాన్ని సంపన్న దేశాలు ‘పెట్టుబడి లక్ష్యాలు’గా చూడ కూడదని భారత్‌ పేర్కొంది. అలాగే క్లైమేట్‌ ఫైనాన్స్‌ ఎవరు అందించాలి, ఎవరు సమీకరించాలి అనే దాన్ని పారిస్‌ ఒప్పందం స్పష్టంగా పేర్కొందని కూడా భారత్‌ గుర్తు చేసింది. 
 
భారత ప్రధాన సంధానకర్త నరేష్‌ పాల్‌ గాంగ్వార్‌ ఈ వివరాలను కాప్‌ 29 సదస్సులో మాట్లాడుతూ తెలిపారు. నరేష్‌ పాల్‌ గాంగ్వార్‌ చేసిన ప్రసంగాన్ని భారత పర్యావరణ మంత్రిత్వ శాఖ అధికారికంగా శుక్రవారం విడుదల చేసింది. 
 
‘వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా పోరాటంలో మేం కీలకమైన దశలో ఉన్నాం. మనం ఇక్కడ (బాకులో) నిర్ణయించుకోవాల్సింది ప్రపంచానికి ముఖ్యంగా గ్లోబల్‌ సౌత్‌కు ప్రధానమైన ఉపశమన చర్యలు తీసుకోవాలి, ఆర్థిక సహాయం స్వీకరించడానికి వీలు కల్పించాలి. అప్పుడే కాప్‌ చారిత్రాత్మకం అవుతుంది’ అని గాంగ్వార్‌ పేర్కొన్నారు. 
 
అజర్‌బైజాన్‌లోని బాకులో జరుగుతున్న ఐరాస కాప్‌29లో సాంకేతిక, గ్లోబుల్‌ వార్నింగ్‌ వంటి అంశాలపైనా చర్చలు జరుగుతున్నా..’క్లైమేట్‌ ఫైనాన్స్‌’ అనేదే ప్రధాన అంశంగా ఉన్న సంగతి తెలిసిందే. క్లైమేట్‌ ఫైనాన్స్‌పై నూతన కలెక్టివ్‌ క్వాంటిఫైడ్‌ గోల్‌ (ఎన్‌సిక్యూజి) నిర్ణయించడమే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం ప్రారంభమయింది. 
 
2009లో అంగీకరించబడిన దాని ప్రకారం 2025 ఏడాది వరకూ సంవత్సరానికి 100 బిలియన్ల డాలర్లను అందించాలి. అయితే ఇది 2022లో ఒక్కసారి మినహా ఎప్పుడూ అమలుకాలేదు. బాకులో జరుగుతున్న చర్చల నుంచి అర్జెంటీనా ప్రతినిధులు వాకౌట్‌ చేశారు. ఆ దేశ అధ్యక్షులు జేవియర్‌ మిలీ ఆదేశాల మేరకే ప్రతినిధులు ఈ నిర్ణయం తీసుకున్నారు. బాకు నుంచి నిష్క్రమించారు. 
 
కాగా, జేవియర్‌ మిలీ వాతావరణ సంక్షోభాన్ని ‘సోషలిస్ట్‌ అబద్ధం’ అని గతంలోనే విమర్శించారు. గత ఏడాది ఎన్నికల ప్రచారంలో ‘పారిస్‌ ఒప్పందం’ నుంచి వైదొలగుతామని ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ ఎన్నికైన దగ్గర నుంచి పారిస్‌ ఒప్పందం భవిష్యత్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
 
అర్జెంటీనా బాటలో మరిన్ని దేశాలు నడిచే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే బాకు సమావేశాలకు దూరంగా ఉండాలని ఫ్రాన్స్‌ నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్‌ ప్రకారం ఈ సమావేశాలకు మంత్రి అగెస్‌ రునచెర్‌ పాల్గొనవల్సి ఉంది. అయితే మంత్రి చివరి క్షణంలో తన పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు.