* ఉద్యోగం పోతే 60 రోజుల్లో దేశం విడవాల్సిందే!
మెటా, అమెజాన్ సహా అనేక టెక్ కంపెనీలు లేఆఫ్స్ ప్రకటిస్తూ ఉండడంతో అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వేలమంది భారతీయులు ప్రస్తుతం ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఇప్పుడు వారి సమస్య ఉద్యోగమే కాకుండా దేశంలో చట్టబద్ధంగా ఉండేందుకు ఉన్న హక్కును కూడా కోల్పోతున్నారు. ఉద్యోగం లేకుంటే హెచ్1బీ వీసా రద్దయి వేలాది మంది భారతీయుల డాలర్ డ్రీమ్స్ చెదిరిపోతున్నాయి.
వీరికి అక్కడి నిబంధనల ప్రకారం హెచ్1బీ వీసా హక్కు తిరిగి పొందాలంటే ఉద్యోగం కోల్పోయిన వారు 60 రోజుల్లోగా తిరిగి ఉద్యోగం పొందాలి. ఈ కాలంలోపు ఉద్యోగం పొంది స్పాన్సర్‌షిప్ పొందితేనే అమెరికాలో ఉండటానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ 60 రోజుల్లో ఉద్యోగం పొందకపోతే అలాంటివారిని గుర్తించి, బలవంతంగానైనా అమెరికా నుంచి పంపించి వేస్తారు.
ప్రస్తుతం లేఆఫ్స్ వల్ల భారతీయులు లక్షలాదిగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా మంది ఏళ్లుగా అక్కడ పని చేస్తున్నారు. కొందరు ఇంటి కోసం లోన్లు తీసుకున్నారు. పిల్లల్ని అక్కడే చదివిస్తున్నారు. పర్మినెంట్ నివాసం కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో అక్కడ ఉద్యోగాలు కోల్పోతుండటం తీవ్రంగా కలవరపెడుతోంది.
అయితే, ఇలా ఉద్యోగాలు కోల్పోతున్న వారు మరికొంతకాలం అమెరికాలో ఉండి ఉద్యోగం వెతుక్కునేందుకు వీలుగా ప్రస్తుతం తాత్కాలికంగా బీ–2 విజిటర్ వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో ఈ వీసాల కోసం దరఖాస్తులు భారీగా పెరిగిపోయాయి. ఈ వీసాలు పొందితే అమెరికాలో మరో ఆరు నెలలపాటు ఉండే అవకాశం దొరుకుతుంది.
కానీ, దీనివల్ల కూడా అక్కడ అనేక న్యాయపరమైన చిక్కులు ఏర్పడే అవకాశాలున్నాయి. ఈ వీసాలు పొందడం కూడా కష్టంగా మారుతోంది. ఇందుకోసం అనేక డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వైపు వనరులను దూకుడుగా మళ్లిస్తున్న మెటా సంస్థ సుమారు 8 వేల ఉద్యోగాలను తొలగించగా, అమెజాన్ కూడా పలు దఫాలుగా తన బృందాలను కుదిస్తూనే ఉంది.
టెక్ పరిశ్రమ ఏఐ, ఆటోమేషన్ చుట్టూ తనను తాను పునర్నిర్మించుకుంటున్న నేపథ్యంలో, లింక్డ్‌ఇన్ కూడా ఇటీవలి నెలల్లో ఉద్యోగాలను తగ్గించింది. ఈ ఒక్క సంవత్సరంలోనే టెక్ కంపెనీలలో 1,10,000 మందికి పైగా ఉద్యోగులు రోడ్డున పడ్డారు. వీరిలో అత్యధిక భాగం విదేశీయులు, ముఖ్యంగా భారతీయులే ఉన్నట్లు తెలుస్తోంది.

More Stories
శుద్ధి చేసిన యురేనియం ఇరాన్‌లోనే ఉండాలి
ఇరాన్ యుద్ధంలో 42 సైనిక విమానాలు కోల్పోయిన అమెరికా
పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి హమ్జా బుర్హాన్ పాక్ లో కాల్చివేత!