బీసీసీఐ అభ్యంత‌రంతో పాకిస్థాన్‌లో చాంపియ‌న్స్ ట్రోఫీ టూర్ ర‌ద్దు

బీసీసీఐ అభ్యంత‌రంతో పాకిస్థాన్‌లో చాంపియ‌న్స్ ట్రోఫీ టూర్ ర‌ద్దు

 ప్ర‌తిష్ఠాత్మ‌క చాంపియ‌న్స్ ట్రోఫీ ఆతిథ్య హ‌క్కులు కోల్పోయే ప్ర‌మాదంలో ప‌డిన పాకిస్థాన్‌కు మ‌రో షాక్ తగిలింది. పాకిస్థాన్ ఆక్రమిత్ కశ్మీర్‌లో పాక్ క్రికెట్ బోర్డు (పిసిబి) నిర్వహించ తలపెట్టిన ఛాంపియన్స్ ట్రోఫీ టూర్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) చెక్ పట్టింది. వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉంది. 

ఈ టోర్నీకి సంబంధించిన అధికారిక షెడ్యూల్‌ను ఐసిసి ఇంకా ప్రకటించలేదు. అయితే తాజాగా, గురువారం ఆ దేశంలో చాంపియ‌న్స్ ట్రోఫీ టూర్‌కు అనుమ‌తిచ్చిన అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి (ఐసిసి) శుక్ర‌వారం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. చాంపియ‌న్స్ ట్రోఫీని పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌లో సంద‌ర్శ‌న‌కు ఉంచాల‌నుకున్న పాకిస్థాన్ బోర్డుకు ఝ‌ల‌క్ ఇచ్చింది.

నవంబర్ 16న పాక్ రాజధాని ఇస్లామాబాద్ నుంచి ఈ ట్రోఫీ టూర్ ప్రారంభం కానుంది. కానీ పాక్ బోర్డు మాత్రం పిఓకె పరిధిలో ఉన్న స్కర్దు, హుంజా, ముజఫరాబాద్ ప్రాంతాలను కూడా షెడ్యూల్ జాబితాలో చేర్చింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) ఈ విషయాన్ని ఐసిసి దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై స్పందించిన ఐసిసి పిఓకెలో ట్రోఫీ టూర్‌పై నిషేధం విధింంచింది. దీంతో పాక్ క్రికెట్ బోర్డు షాక్‌కు గురైంది.

వివాదాస్ప‌ద ప్రాంతాల్లో ట్రోఫీని ప్ర‌ద‌ర్శించేందుకు అనుమ‌తి లేదంటూ టూర్‌ను ర‌ద్దు చేసింది. భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి అభ్యంత‌రాల మేర‌కు ఐసీసీ ఈ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు స‌మాచారం.  చాంపియ‌న్స్ ట్రోఫీ ప్ర‌చారంలో భాగంగా న‌వంబ‌ర్ 14వ తేదీన ఐసీసీ ట్రోఫీని పాకిస్థాన్‌కు అంద‌జేసింది. ఇస్లామాబాద్ చేరుకున్న ఆ ట్రోఫీని పీసీబీ వారం రోజులు (న‌వంబ‌ర్ 16 నుంచి 24 వ‌ర‌కూ) త‌మ దేశ‌మంతా తిప్పాల‌నుకుంది. ఇదే విష‌యాన్ని పీసీబీ అధికారికంగా వెల్ల‌డించింది కూడా. పీసీబీ ఆ పోస్ట్ పెట్టిన మ‌రునాడే ఐసీసీ టూర్‌ను ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం వెలువ‌రించింది. అస‌లు ఏం జ‌రిగిందంటే..?

‘పాకిస్థాన్ ప్ర‌జ‌ల‌రా సిద్ధంగా ఉండండి. న‌వంబ‌ర్ 16వ తేదీన ఇస్లామాబాద్‌లో చాంపియ‌న్స్ ట్రోఫీ టూర్ మొద‌ల‌వ్వ‌నుంది. అక్క‌డి నుంచి ప‌ర్యాట‌క ప్రాంతాలైన‌ స్క‌ర్దు, ముర్రీ, హుంజా, ముజ‌ఫ‌రాబాద్‌ల‌లో కూడా ట్రోఫీని సంద‌ర్శ‌న‌కు పెడుతాం. 2017లో ఓవ‌ల్ మైదానంలో స‌ర్ఫ‌రాజ్ అహ్మ‌ద్ అందుకున్న ఈ ట్రోఫీని న‌వంబ‌ర్ 16 నుంచి 24వ తేదీల మ‌ధ్య‌ చూసి త‌రించండి’ అని పీసీబీ ఎక్స్ వేదిక‌గా పోస్ట్ పెట్టింది.

స్క‌ర్దు, ముర్రీ, హుంజా, ముజ‌ఫ‌రాబాద్‌లు పాకిస్థాన్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌లో భాగం. అందుక‌ని బీసీసీఐ అభ్యంత‌రం తెలిపింది. పీఓకేను కూడా భార‌త్‌లో అంత‌ర్భాగంగా భావిస్తామ‌ని, పాకిస్థాన్ బోర్డు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పీఓకేలో చాంపియ‌న్స్ ట్రోఫీ టూర్ నిర్వ‌హించ‌కూడ‌ద‌ని ఐసీసీకి బీసీసీఐ తెగేసి చెప్పేసింది.  ఇంకేముంది వెంట‌నే పీఓకే ప్రాంతాల్లో చాంపియ‌న్స్ ట్రోఫీ టూర్‌ను ఐసీసీ ర‌ద్దు చేసింది. దాంతో, బీసీసీఐని ఉడికిస్తూ పీఓకేలో ట్రోఫీని సంద‌ర్శ‌న‌కు ఉంచాల‌నుకున్న పీసీబీకి దిమ్మ‌దిరిగే షాక్ త‌గిలింది.

ఇదిలావుంటే వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోపీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. కానీ భద్రత కారణాల వల్ల పాక్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు బిసిసిఐ అంగీకరించడం లేదు. ఇదే విషయాన్ని పిసిబి, ఐసిసి దృష్టికి తీసుకెళ్లింది. హైబ్రిడ్ పద్ధతిలో టోర్నీని నిర్వహించాలని బిసిసిఐ కోరింది. 

భారత్ ఆడే మ్యాచ్‌లతో పాటు నాకౌట్ పోటీలను పాక్ కాకుండా వేరే దేశంలో జరిగేలా చూడాలని బిసిసిఐ కోరుతోంది. దీనికి ఐసిసి సానుకూలంగానే స్పందించింది. అయితే పాక్ బోర్డు హెబ్రిడ్ పద్ధతిలో టోర్నీని నిర్వహించేందుకు ఒప్పుకోవడం లేదు. అన్ని మ్యాచ్‌లు తమ దేశంలోనే నిర్వహిస్తామని ఐసిసికి స్పష్టం చేసింది. దీంతో పాక్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరగడం ప్రశ్నార్థకంగా మారింది.