డాక్టర్ అవ్వాలంటే ఏ ప్రాంతం వారైనా, ఏ కాలేజీలోనైనా సరే మన దేశంలో ఆంగ్ల మాధ్యమంలో వైద్య విద్య పాఠాలు చదువుకోవాల్సిందే. త్వరలో ఈ విధానంలో మార్పు రాబోతుంది. వైద్య విద్యను హిందీ సహా ఇతర భారతీయ భాషల్లో అందుబాటులోకి తీసుకువస్తామని ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు.
బీహార్ లోని దర్బంగాలో ఎయిమ్స్ ఆస్పత్రి శంకుస్థాపన సహా రూ.12,100 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులను మోదీ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రధాని మాట్లాడుతూ.. స్థానిక భాషల్లో వైద్య విద్యపై ప్రకటన చేశారు. అలాగే, దేశ వ్యాప్తంగా వచ్చే ఐదేళ్లల్లో మరో 75 వేల మెడికల్ సీట్లు అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు.
దేశంలో 1.5 లక్షలకు పైగా ఉన్న ‘ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు’ బడుగు బలహీనవర్గాలకు మెరుగైన సేవలందిస్తున్నాయని ప్రధాని తెలిపారు. దేశంలో దాదాపు నాలుగు కోట్ల మంది ప్రజలు దీని ద్వారా ప్రయోజనం పొందుతున్నారని చెప్పారు.
ఈ సందర్భంగా బీహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్‌ని ప్రధాని కొనియాడారు. ఆటవిక రాజ్యంగా ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారన్నారు. కాగా, ఈ సభలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. నీతీష్‌కుమార్ ప్రధాని పాదాలకు నమస్కరించేందుకు ప్రయత్నించారు. అయితే నితీష్‌ను ప్రధాని నిలువరించారు.
కాగా, మోదీ పాదాలకు నీతీశ్ నమస్కరించేందుకు ప్రయత్నించడం ఈ ఏడాదిలో ఇది మూడోసారి కావడం గమనార్హం. జూన్‌లో పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ప్రధానిని కలిసిన సందర్భంలోనూ, అంతకుముందు లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ నవాదాలో నిర్వహించిన ఓ సభలో ప్రధాని పాదాలను తాకడానికి నితీష్ ప్రయత్నించారు.
కాగా, స్థానిక భాషలో వైద్య విద్య బోధన జరగాలని తమిళనాడు సహా పలు రాష్ట్రాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. మధ్యప్రదేశ్ ఇప్పటికే వైద్య విద్య హిందీ మీడియం పుస్తకాలను విడుదల చేసింది. బిహార్‌లో వైద్య విద్యను హిందీలో అందిస్తామని ఆ రాష్ట్ర మంత్రి కూడా ప్రకటించారు.
More Stories
లింగాయత్ల కోటా పోరుపై పోలీసుల లాఠీచార్జి
ఎస్ఎం కృష్ణ మృతిపట్ల ప్రధాని, చంద్రబాబు సంతాపం
బొగ్గు స్థానంలో క్లీన్ ఎనర్జీ సాధ్యమా?