కేరళలో అయ్యప్ప స్వామి కొలువైన శబరిమలను సందర్శించే భక్తుల కోసం ఏఐ చాట్‌బాట్‌ను అందుబాటులోకి తెచ్చారు. శబరిమల యాత్రను మరింత సౌకర్యవంతం చేసేందుకు ‘స్వామి చాట్‌బాట్’ను రూపొందించారు. పతనంతిట్ట జిల్లా యంత్రాంగం అభివృద్ధి చేసిన ఈ చాట్‌బాట్ లోగోను ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆవిష్కరించారు.
‘శబరిమల తీర్థయాత్ర అనుభవాన్ని మెరుగుపరచడానికి పతనంతిట్ట జిల్లా యంత్రాంగం అభివృద్ధి చేసిన స్మార్ట్ ఏఐ సాధనం ‘స్వామి’ చాట్‌బాట్ లోగో ఆవిష్కరించడం గౌరవంగా ఉంది’ అని ఆయన పేర్కొన్నారు. కాగా, స్మార్ట్‌ఫోన్ ఇంటర్‌ఫేస్ ద్వారా భక్తులకు ఆరు భాషలైన మలయాళం, ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, కన్నడలో శబరిమల గురించి సమగ్ర సమాచారాన్ని అయ్యప్ప స్వామి స్వయంగా అందించినట్లుగా సమగ్ర వివరాలు లభ్యమయ్యేలా ఈ చాట్‌బాట్‌ను రూపొందించారు.
శబరిమలలో పూజాసమయాలు, ఇతర విశేషాలే కాకుండా.. భక్తులు విమానాలు, రైళ్లు, స్థానిక పోలీసుల వివరాలు, అటవీశాఖ సేవలను ‘స్వామి’ ద్వారా పొందవచ్చు. శబరిమలలో నవంబర్ 15న ‘మండల పూజా మహోత్సవం’ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ‘స్వామి చాట్‌బాట్’ను అందుబాటులోకి తెచ్చారు.
శబరిమల నడక మార్గాల్లో భక్తులకు వాతావరణ హెచ్చరికలను జారీ చేసేందుకు భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) శబరిమల చరిత్రలోనే తొలిసారి మూడు వాతావరణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. తిరువనంతపురం ఐఎండీ డైరెక్టర్ నీతా.కె.గోపాల్ బుధవారం తొలి బులెటిన్‌ను విడుదల చేశారు. గురు, శుక్రవారాల్లో శబరిమలలో భారీ వర్షాలు కురుస్తాయని ఆమె పేర్కొన్నారు.
మరోవైపు, ఇటీవల నెలవారీ పూజలకు కూడా భక్తులు శబరిమలకు పోటెత్తడంతో మండల, మకరవిళక్కు నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు(టీడీబీ) అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ వెల్లడించారు. గురువారం నుంచి మండల పూజల సీజన్ ప్రారంభమవుతుందని, భక్తుల సౌకర్యార్థం స్వామివారి దర్శన సమయాన్ని 18 గంటలకు పొడిగిస్తున్నామని తెలిపారు.
‘‘తెల్లవారుజామున 3 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు.. తిరిగి మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తాం. రోజుకు 80 వేల మంది భక్తులకు దర్శనం టికెట్లను విడుదల చేస్తాం. వీటిల్లో 70 వేలు ఆన్‌లైన్ బుకింగ్ కాగా.. మరో 10వేలు స్పాట్‌బుకింగ్. ఎరుమేలి, వండిపెరియార్, పంపా వద్ద స్పాట్ బుకింగ్ కౌంటర్లుంటాయి’’ అని ఆయన వివరించారు. పదునెట్టాంబడి వద్ద సెల్‌ఫోన్లను నిషేధిస్తున్నట్లు తెలిపారు.
More Stories
లింగాయత్‌ల కోటా పోరుపై పోలీసుల లాఠీచార్జి
ఎస్ఎం కృష్ణ మృతిపట్ల ప్రధాని, చంద్రబాబు సంతాపం
బొగ్గు స్థానంలో క్లీన్ ఎనర్జీ సాధ్యమా?