దేశంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలను పటిష్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రజలకు సరసమైన, ఉచిత వైద్యం, మందులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. బుధవారం బిహార్ లో పర్యటించిన ప్రధాని ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ రైల్వే స్టేషన్లలో 18 ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాలను జాతికి అంకితం చేశారు.
వీటిలో తెలంగాణలోని కాచిగూడ రైల్వేస్టేషన్ తో పాటు బిహార్, యూపీ, త్రిపుర, రాజస్థాన్, తమిళనాడు, ఛత్తీస్ గఢ్, కర్ణాటక, గుజరాత్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ స్టేషన్లలో జన ఔషధి కేంద్రాలను వర్చువల్ గా ప్రారంభించారు. ఈ కేంద్రాల ద్వారా ప్రయాణికులకు సరసమైన ధరలకు రైల్వే స్టేషన్లలో నాణ్యమైన మందులు అందుబాటులో ఉండేలా చేస్తారు.
ఈ సందర్భంగా కాచిగూడలో జరిగిన కార్యక్రమానికి హైదరాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ లోకేష్ విష్ణోయ్, హైదరాబాద్ డివిజన్ అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ ఎమ్‌ఎ .రెహ్మాన్, హైదరాబాద్ డివిజన్ నుండి ఇతర రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ లోకేష్ విష్ణోయ్ మాట్లాడుతూ రైల్వే స్టేషన్‌లలో సదుపాయాలను మెరుగుపరుచడం ద్వారా ప్రజల అవసరాలను తీర్చేందుకు భారతీయ రైల్వే కట్టుబడి ఉందని తెలిపారు. జనౌషధి కేంద్రాలు సరసమైన ధరలకు మందులను అందించడం ద్వారా సమాజంలోని అన్ని వర్గాలలో ఆరోగ్యాన్ని పెంపొందించడానికి దోహదపడుతుందని చెప్పారు. రైల్వే స్టేషన్లలో ప్రయాణీకులు, సందర్శకులు జనౌషధి ఉత్పత్తులను సులభంగా పొందడానికి వీలు కలుగుతుందని పేర్కొన్నారు.
ప్రతి రోజూ సుమారు 47 వేల మంది ప్రయాణికుల రాకపోకలతో దక్షిణ మధ్య రైల్వేలోని ప్రధాన స్టేషన్లలో కాచిగూడ రైల్వే స్టేషన్ ఒకటి. ప్రజల సౌకర్యార్థం దాదాపు 100 రైళ్లు ఈ స్టేషన్ నుండి ప్రతి రోజూ రాకపోకలు సాగిస్తాయి. కాచిగూడ స్టేషన్ ప్రాంగణంలో ప్రారంభించబడిన ఈ జనౌషధి కేంద్రం సరసమైన ధరలకు నాణ్యమైన మందులను కొనుగోలు చేయడంలో ప్రజలతో పాటు వేలాది మంది ప్రయాణికులకు ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది.
More Stories
బాంగ్లాలో హిందువులపై మారణకాండ పట్ల భారత్ చర్యలు చేపట్టాలి
తెలుగు రాష్ట్రాల్లో కొండెక్కిన గుడ్ల ధర
పోలీసులు క్షమాపణలు చెప్పాల్సిందే.. ఆశా వర్కర్లు